శాండిల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గత కొంతకాలంగా మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లి మీయామీ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మూత్రాశయ క్యాన్సర్ కి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి అయినట్లు ఆపరేషన్ చేసిన డాక్టర్ మురుగేషన్ మనోహర్ స్వయంగా ఒక వీడియో తీసి శివన్న హెల్త్ అప్డేట్ ఇచ్చారు. అంతేకాకుండా శివన్న కూతురు నివేదిత కూడా సోషల్ మీడియాలో తన తండ్రి గురించిన హెల్త్ అప్డేట్ ఒకటి పోస్ట్ చేసింది.
దేవుడి దయవల్ల మా నాన్నగారి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది దీనికి ప్రధాన కారణం మియామీ హెల్త్ కేర్ వైద్య బృందం, ఈ సర్జరీ లో తమ కుటుంబానికి అన్ని విధాలా సహకరించిన మురుగేషన్ మనోహర్ గారికి సైతం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ శివన్న ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపింది అంతేకాకుండా అభిమానులని ఉద్దేశిస్తూ మీ అందరి ప్రేమ, ప్రార్థనలే మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి.
మీరు చూపుతున్న ఈ ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగి తమకి శక్తినివ్వాలి, మీ అందరికీ రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది నివేదిత. అమెరికాలో శివరాజ్ కుమార్ కి ఆపరేషన్ జరుగుతుంది అని తెలియటంతో చాలాచోట్ల శివన్న అభిమానులు ఆలయాలలో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు చేయించారు. అలాగే ఆయన అమెరికా వెళ్లే సమయంలో పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఇంటికి వెళ్లి మరీ ఆయనకి వీడ్కోలు పలికారు.
ప్రస్తుతం అమెరికాలో ఆయనతోపాటు ఆయన భార్య గీత శివరాజ్ కుమార్, కుమార్తె నివేదిత తో పాటు శివన్న కోడలు కర్ణాటక విద్యా శాఖ మంత్రి అయిన మధు బంగారప్ప కూడా అక్కడే ఉన్నారు. ఇక శివన్న జనవరి 25 న కర్ణాటక తిరిగి వస్తారని అప్పటివరకు అమెరికాలోనే ఉంటారని సమాచారం. ఏదేమైనా శివన్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుసుకున్న అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.