సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా తాను ఒంటరిగానే పోటీ చేస్తానని.. తన పొత్తు ప్రజలతోనే అని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మరోపక్క తమ కూటమిలో బీజేపీని ఎట్టిపరిస్థితుల్లోనూ కలుపుకోవాలని పవన్ పరితపిస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో బీజేపీ రాకపోతే వామపక్షాల వైపు చూడొచ్చని బాబు భావిస్తున్నారని అంటున్నారు.
అలా ఎవరి లెక్కలు అలా ఉన్న వేళ… బీజేపీ నుంచి టీడీపీ+జనసేన కూటమికి పాజిటివ్ సంకేతాలు అందాయని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకూ అభ్యర్థులను ఫైనల్ చేయకుండా.. పొత్తులో భాగంగా జనసేనకు ఇంకా సీట్లు కన్ ఫాం చేయకుండా ఎదురుచూసిన దానికి ఫలితం దక్కిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా… ఏపీలో టీడీపీ – జనసేన కూటమితో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.
వాస్తవానికి మొదటినుంచీ పవన్ కల్యాణ్ కోరుకున్నది ఇదే. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ గేటు తాకాలని బలంగా ఫిక్సయిన పవన్… అందుకు 2014 తరహా కూటమి సహకరిస్తుందని భావించారని చెబుతుంటారు. ఇదే సమయంలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని నమ్మారు. అందుకోసం తాను చేయాల్సిన ప్రయత్నాలు చేశారని చెబుతుంటారు.
ఈ క్రమంలో… బాబు ఎదురుచూపులు, పవన్ ప్రయత్నాలు, పురందేశ్వరి కోరికలు నెరవేరాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా టీడీపీ-జనసేన కూటమితో చేరేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించారని.. ఈ క్రమంలో వారు 5 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నారని.. ఆ స్థానాలను కూడా వారే ఎంపిక చేసుకున్నారని.. ఆ స్థానాల లిస్ట్ బాబుకు పంపించారని కథనాలొస్తున్నాయి.
ఇందులో భాగంగా… విశాఖపట్నం, రాజమండ్రి, నరసాపురం, విజయవాడ, రాజంపేట, తిరుపతి లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ఆయా స్థానాల్లో పోటీచేసే బీజేపీ లోక్ సభ అభ్యర్థులు వీరే అంటూ కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ జాబితా ఏమిటనేది ఇప్పుడు చూద్దాం…!
విశాఖపట్నం – జీవీఎల్ నరసింహరావు / సీఎం రమేశ్
రాజమండ్రి – దగ్గుబాటి పురందేశ్వరి
నరసాపురం – రఘురామకృష్ణంరాజు (బీజేపీలో చేరిన తర్వాత!)
విజయవాడ – సుజనా చౌదరి
రాజంపేట – నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి / సత్యకుమార్
తిరుపతి – రత్నప్రభ లు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నరసాపురం
ఇక బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్న అసెంబ్లీ స్థానాలు, ఆ పార్టీ అభ్యర్థుల విషయానికొస్తే…
విశాఖ ఉత్తర – విష్ణుకుమార్ రాజు
విశాఖ తూర్పు – పీ.వీ.ఎన్. మాధవ్
రాజమండ్రి సిటీ – సోము వీర్రాజు
పి.గన్నవరం – మానేపల్లి అయ్యాజివేమ
కైకలూరు – కామినేని శ్రీనివాస్
గుంటూరు వెస్ట్ – వల్లూరి జయప్రకాష్ నారాయణ
మదనపల్లె – చల్లా నరసింహా రెడ్డి
తిరుపతి – భానుప్రకాశ్ రెడ్డి
శ్రీకాళహస్తి – కోలా ఆనంద్.. లు బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే… దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.