కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మద్యన జరుగుతున్న యుద్దంలో నిమ్మగడ్డదే పైచేయి అయింది. గవర్నర్ ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇన్నాళ్ళు పంతానికి పోయి వ్యవహారాన్ని సాగదీస్తూ వచ్చిన ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయాన్ని మరీ తీవ్రంగా తీసుకున్న నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలు ప్రభుత్వానికి అస్సలు మింగుడుపడవనేది నూటికి నూరుపాళ్ళు నిజం. హైకోర్టు నిమ్మగడ్డను వెళ్లి గవర్నర్ వద్ద విషయం తేల్చుకోమని చెప్పిన రోజు నుండి ఆదేశాలు తమకే అనుకూలంగా వస్తాయని వైసీపీ సర్కార్ ఆశలు పెట్టుకుంది. కానీ గవర్నర్ నిమ్మగడ్డకు అనుకూలంగా ఆదేశాలివ్వడంతో వాటిని తప్పక అనుసరించాల్సిన పరిస్థితి తలెత్తింది.
కానీ సర్కార్ మాత్రం గవర్నర్ ఆదేశాలను పాటించడానికి సిద్దంగా ఉన్నట్టు కనిపించడంలేదు. ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే ఈ సంగతి అర్థమవుతుంది. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే నిమ్మగడ్డ తన స్థానానికి ఎలా న్యాయం చేస్తారని, అసలు కేసులు వాదనకు లాయర్లకు కోట్ల రూపాయల ఫీజులు చెల్లించడానికి డబ్బు నిమ్మగడ్డకు డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. అంతేకాదు తాము గవర్నర్ ఆదేశాలకు వ్యతిరేకం కాదని అంటూనే సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని, ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకుంటామని అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి నిమ్మగడ్డను నియమించడానికి ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని, వీలైతే ఆపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
Read More : OTT అంతు చూడనిదే వదిలేట్టు లేడు!
ఒకవేళ గవర్నర్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డను తిరిగి నియమించకుంటే ప్రభుత్వం రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినట్టే అవుతుంది. ఇప్పటికే న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్నారనే అపకీర్తి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఉంది. హైకోర్టు నిమ్మగడ్డ తిరిగి పదవిలోకి వెళ్లవచ్చని ఉత్తర్వులు ఇవ్వగా ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా సుప్రీం కోర్టుకు వెళ్లి హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలని రెండుసార్లు పిటిషన్ వేసింది. కానీ సుప్రీం కోర్టు వాటిని నిరాకరించింది. మూడోసారి కూడా స్టే కోరుతూ పిటిషన్ వేసింది. చివరికి నిమ్మగడ్డ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్ వేశారు. దీని మీద కూడా విచారణ జరగాల్సి ఉంది. ఇక సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పు మీద స్టే ఇస్తుందనే ప్రభుత్వ ఆశలు తీరకపోవచ్చు. గతంలో హైకోర్టు తీర్పుల మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. కాబట్టి ఈసారి కూడా స్టే పిటిషన్ నిరాకరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువ.
Read More : అయ్యో.. బాబుకు ఆ దమ్ము, ధైర్యం లేకపాయే ?
నిమ్మగడ్డ విషయంలోనే కాదు పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో కూడ హైకోర్టులో అక్షింతలు పడ్డాయి. నేరుగా న్యాయవాదులే నేతలకు న్యాయ వ్యవస్థను అకారణంగా తప్పుబడుతున్నారని నోటీసులు పంపారు. ఈ పరిణామాలతో న్యాయవ్యవస్థ మీద ప్రభుత్వానికి గౌరవం బొత్తిగా లేదని, కోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయడం లేదనే బ్లాక్ మార్కు పడింది. ఇప్పుడు గవర్నర్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోకపోతే రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడుతున్నారనే విమర్శల్ని కూడ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విమర్శలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం లెకపోలేదు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేస్తాయి.
కాబట్టి సర్కార్ పంతాలకు పట్టింపులకు చెక్ పెట్టి నిమ్మగడ్డను తిరిగి ఈసీ పదవిలోకి తీసుకోవడమే ఉత్తమమైన పని. అయినా నిమ్మగడ్డ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. వచ్చే యేడాది ఏప్రిల్ నాటికి ఆయన పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంది. ఈ కొద్ది నెలలు ఆయన పదవిలో ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. పైగా ఈ కరోనా పరిస్థితుల్లో ఆయన తన విశేష అధికారాలను ఉపయోగించే ఆవసరం కూడా పెద్దగా రాకపోవచ్చు. వచ్చినా గత అనుభవాల దృష్ట్యా ఏకపక్షంగా వ్యవహరించకపోవచ్చు. కనుక ప్రభుత్వం నిమ్మగడ్డ నియామకాన్ని ఆపే దారులు వెతుక్కోకుండా గవర్నర్ ఆదేశాల మేరకు ఆయన్ను విధుల్లోకి తీసుకుంటే కష్టంగా ఉన్నా ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించిందనే మంచి పేరు దక్కుతుంది.