ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ వ్యవహారంలో తెలంగాణ అస్సలేమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ‘ఆర్టీసీ’ పరంగా రాకపోకలు నిలిచిపోయాయి.. మళ్ళీ పునఃప్రారంభమయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ‘మీతో మాకేం పని లేదు..’ అని తెలంగాణ భీష్మించుక్కూర్చుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ‘మీ అవసరం మాకు చాలా వుంది’ అంటూ దేబిరించింది. ఎలాగైతేనేం, ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా మెట్లు కిందికి దిగితే తప్ప, తెలంగాణ అంగీకరించలేదు.
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.!
‘మేం సర్వీసులు తగ్గించుకోవాల్సి వచ్చింది.. తద్వారా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోంది. చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి తప్ప, ఫలితం లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్.. ఇలాంటి పరిస్థితిని అస్సలు ఊహించలేదు..’ అంటూ ఆర్టీసీకి చెందిన ఉద్యోగి ఒకరు ఆఫ్ ది రికార్డ్‌గా ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ‘మాకు బేషజాల్లేవు.. తెలంగాణతో అసలే పంచాయితీ లేదు. కానీ, తెలంగాణ తమ సర్వీసుల్ని పెంచుకోవడంలేదు.. మమ్మల్ని తగ్గించుకోమంటోంది.. అక్కడే ప్రతిష్టంభన..’ అని చెప్పిన ఆంధ్రప్రదేశ్, చివరికి తెలంగాణ సూచన మేరకే సర్వీసుల్ని తగ్గించుకుంది.
అప్పుడెందుకు చెయ్యలేదో మరి.!
లాక్‌డౌన్ నుంచి కొన్ని ఉపశమనాలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య ఇతర రాష్ట్రాల్లానే ఆర్టీసీ బస్సులు నడిచి వుండాలి. కానీ, ప్రైవేటు బస్సులు తిరిగాయ్ తప్ప, ఆర్టీసీ బస్సులు తిరగడానికి ‘ఒప్పందాలు’ సహకరించలేదు. మధ్యలో నష్టపోయిందెవరు.? తెలంగాణ ఈ నష్టాల గురించి పెద్దగా ఆలోచించడంలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ అందుకు పూర్తి భిన్నం. ఈ తగ్గింపు ఏదో గతంలోనే చేసేసుకుని వుంటే, ప్రయాణీకులకు ‘ప్రయాణ నరకం’ తప్పేది కదా.?
ప్రైవేటు నిలువు దోపిడీ ఎవరి పాపం.?
నూటికి నూరుపాళ్ళూ ప్రైవేటు దోపిడీకి రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ పరోక్షంగా సహకరించినట్లయ్యింది. పోతే పోనీ.. ప్రయాణీకుడే కదా.! దసరా సీజన్‌ని రెండు తెలుగు రాష్ట్రాలూ మిస్ అయ్యాయి. ఇంత జరిగాక కూడా తెలంగాణ ఆర్టీసీలో ఎక్కడా అసంతృప్తి, ఆవేదన కన్పించడంలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. కేసీఆర్, వైఎస్ జగన్ గనుక.. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిపి వుంటే, పరిష్కారం ఎప్పుడో వచ్చి వుండేది. కానీ, ఎందుకు ఆ చర్చలు జరగలేదు.? ప్రైవేటు దోపిడీ పాపం ఎవరిది.?