మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి మాత్రం సినిమాల వల్ల కాదు, పోలీసుల తనిఖీల వల్ల. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో నార్కోటిక్ విభాగం తనిఖీలు చేపట్టగా, చాకో మాత్రం అక్కడి నుంచి పారిపోయిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో, మూడో అంతస్తు కిటికీ నుంచి దిగిపోయి, మెట్ల మార్గంగా బయటికి పరుగెత్తినట్లు తెలుస్తోంది.
ఈ పరారీ సీసీటీవీలో రికార్డయ్యింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాకోకు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని ఎర్నాకుళం జిల్లా నార్కోటిక్ విభాగం దాడికి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయనపై మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో నటి విన్సీ అలోషియస్ చేసిన ఫిర్యాదు మరింత వేడిని తీసుకొచ్చింది.
విన్సీ ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ ఘటన ‘సూత్రవాక్యం’ సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్నదట. చాకో తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. తాను ఇకపై డ్రగ్స్ వాడే నటులతో కలిసి పని చేయనని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనకు మరింత బలం చేకూర్చుతున్నాయి.
తెలుగు సినీ ప్రేక్షకులకు షైన్ టామ్ చాకో సుపరిచితుడే. నాని హీరోగా నటించిన ‘దసరా’లో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తరవాత వరుసగా తెలుగులోఫ్ అవకాశాలు అందుకున్నారు. ‘రంగబలి’, ‘డాకు మహారాజ్’, ‘దేవర’, ‘రాబిన్ హుడ్’ చిత్రాల్లో నటించారు.