పోలీసుల కళ్లెదుటే కోడిపందాలు, వందల కోట్లకు చేరిన బెట్టింగులు, జూదాలు

 
(వి. శంకరయ్య) 
 
తెలుగు ప్రజలకు సంక్రాంతి- సంబరాల దినాలే కాకుండా పర్వదినాలు కూడా. పుష్కలంగా నాలుగు పంటలు పండే ప్రాంతాల్లో ధాన్య లక్ష్మి ఇళ్లు చేరిన తర్వాత సిరులు కురిపిస్తుంటే రైతులు ఆనంద తాండవం చేసే శుభ సమయం కూడా. ఈ ఆనందోత్సావాలపై ఎపిలోని పాపులర్ మీడియా వారంరోజుల నుండి వివిధ కథనాలు అల్లి వండి వార్చింది. ఇది పాత కథే. అయితే . ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్ లకు నిధులు కేటాయించి ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించి నట్లు వార్తలు వచ్చాయి.  ప్రభుత్వం నిధులు కేటాయించి ఉత్సవాలు జరపడం కొత్తదే. ఇవన్నీ పరిశీలిస్తే కనిపించే  కొన్ని సన్నివేశాలు విషాద సంఘటనలు మాత్రం మరీ కొత్తవి. 
 
కోస్తా జిల్లాల్లో కోడిపందేల నిర్వ హణకు అధికార పార్టీల నేతలు బరి తెగించి బరులు ఏర్పాటు చేశారు. భోగి పండుగ ఒక్క రోజే వందల కోట్ల రూపాయల కోడి పందేల రూపంలో చేతులు మారి నట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. సంక్రాంతి రోజూ విచ్చలవిడిగా ఈ వికృత క్రీడ కొనసాగింది. ఇందులో మూడు అంశాలు ఇమిడి వున్నాయి.
 
1) ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న కేంద్రీకృత విధానాలతో  సంపద ఒక ప్రాంతంలోనే పోగు పడుతున్నదనేందుకు ఇది ప్రత్యక్ష తార్కాణం. రాజధాని చుట్టూ గల నాలుగు జిల్లాల్లోనే కోడి పందేల సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారు తున్నాయి. వెనుక బడిన సీమ- ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వ్యసనం కనిపించడం లేదు. ఈ జిల్లాల నుండి పండుగ పబ్బాలు లేకుండా పూట గడిచేందుకు వలసలు పోవలసి వుంది. గుండెలు పిండే ఈ కథ తర్వాత చూద్దాం .ఈ అసమానతల వైఖరికి రేపు ఎన్నికల్లో ఈ జిల్లాల ప్రజలు ఏం తీర్పు ఇస్తారో వేచి చూడాలి. కాకుంటే తమ జీవన ప్రమాణం మెరుగుదల గాలికి పోగా పెరిగిన ఫించన్లు అన్న క్యాంటిన్ ల భోజనాలకు సెల్ ఫోన్లకు తృప్తి పడతారోఅదీ వేచి చూడాలి.
 
2) ఇక రెండవ అంశం. రాష్ట్రంలో చట్టాలు చట్టు బండలు అయ్యాయి. అధికార పార్టీ నేతలు తమ చేతులలోకి మొత్తం చట్టాన్ని తీసుకొని పోలీసు వ్యవస్థను అచేతనం చేశారనేందుకు కోడి పందేల సంఘటనలు నిదర్శనం. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ అచేతన స్థితికి చేరుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు గాలికి పోయాయి. ఒక వేళ సంప్రదాయం పేర విశృంఖలతకు బార్లా తలుపులు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై వుంటే తమిళ నాడు లాగా తమ అభిప్రాయాలను కోర్టుకు వెల్లడించి వుండాలి. ఈ దాగుడు మూతలు ఎందుకు?ఈ పందేల మాటున మద్యం అమ్మకాలు పెరిగి నిరుపేదల కొంపలు కాలి పోతున్నాయి. 
 
3) రాష్ట్రంలో అమలులో వున్న చట్టాలను అమలు చేయలేని ఈ ప్రభుత్వం మరో వైపు కేంద్రంతన అధికారాలలో కలుగు చేసుకుంటున్నదని వాదించే అర్హత కలిగి వుందా? ఈ అనుమానం ఏ సామాన్యుని కైనా కలగడం తప్పు కాదు కదా?
 
4) సంక్రాంతి సంబరాల పేరుతోనూ లేదా ఎన్నికల సందర్భంగా కఠినంగా వుంటే వ్యతిరేకత వస్తుందని గాని అదీ కాక పోతే తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయ లేక పోతేనూ విచ్చలవిడి జూదాలను నివారించక పోతే తుదకు ఎన్ని కొంపలు కూలి పోతాయో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించి నట్లు లేదు. ఈ ప్రభావం సామాజిక జీవనంపై పడితే కూలి పోయిన కుటుంబాలు కోలు కోవడం ఇప్పట్లో జరుగుతుందా?
 
కోడి పందేల మాటున ఎన్నో రకాల జూదాలు సాగు తున్నాయి.ఇందులో ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ సమిథలౌతునారు. ఎక్కువగా అతి సామాన్య జనమే దివాలా తీస్తున్నారు. ఇంత దుస్థితి ఏర్పడానికి సంపద కొన్ని ప్రాంతాల్లోనే పోగు పడటం కారణమని ముఖ్యమంత్రి కి తెలియక పోలేదు. అంతా తెలుసు. తెలిసే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బూర్జువా సమాజంలో ప్రతి నేత ఇలాగే వుంటారు. ప్రజల జీవన ప్రమాణంపెరిగి స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకొనే స్థితిలో వుంటే వీరు ఓటు బ్యాంకుగా వుండరు కదా?
 
 
నాణేనికి ఇది ఒకవేపు అయితే మరో వేపు భయంకరమైన ముఖ చిత్రం వుంది. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలలో కోట్లు చేతులు మారడం మీడియాలో వచ్చిన రోజునే హృదయాలను కలచి వేసేమరి కొన్ని వార్తలు కొన్ని పత్రికల్లో వచ్చాయి. ఈ మధ్యనే కర్నూలు జిల్లాలో విమానాశ్రయం ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇది తను సాధించిన ఒక చరిత్రగా చెప్పు కొన్నారు. ప్రస్తుతం ఆ కర్నూలు జిల్లాలో ఉపాధి లేకుండా గుంటూరు జిల్లాకు వచ్చిన వందలాది మంది వలస కూలీలు పండుగకు కూడా వెళ్ల కుండా పొలాల్లోనే ఎట్టి వసతులు లేకుండా వుంటుంనారనే విషాద కథనం ముఖ్యమంత్రి దృష్టికి రాలేదా? రాష్ట్రంలో ఏ మారు మూల ఏంజరిగేది క్షణాల్లో తెలుసు కొనే ఆధునిక వ్యవస్థ ఈ దురదృష్టాని గుర్తించ లేక పోవడం ఆశ్చర్య మేమీ కాదు.
 
ఈ వలస కూలీలు పొలాల్లో చిన్న గుడారాలు వేసుకుని వుంటున్నారు. ఈ లాంటి వారు లక్షల సంఖ్యలో వుండ వచ్చు. వీరంతా మన రాష్ట్రమే కాదు.ఇతర రాష్ట్రాలకు వెలు తున్నారు. కేరళ బెంగళూరు లాంటి నగరాల్లో మురికి వాడల్లో నివసించే సీమ కు చెందిన అభాగ్యులు ఎంత మందో.
 
అందుకే ఓర్వ కళ్లు విమానాశ్రయం గురించి సొదుం శ్రీ కాంత్ అనే రచయిత పద కవితలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అరబ్ దేశాల్లో పని చేస్తున్నసీమ వాసులు కార్మికులు చని పోతే శవాలు కుళ్లి పోకుండా స్వంత వూళ్లకు తీసుకు వచ్చేందుకు మాత్రమే విమానాశ్రయం ఉపకరించు తుందని ఆక్రోశం వెలు బుచ్చారు. ఇది నేటి ఎపి ముఖ చిత్రం. 
 
 
 
 
 
 
 
 
 

(వి. శంకరయ్య, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యాఖ్యాత పోన్. 9848394013)