AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు అప్పట్లో సంక్రాంతి పండుగ వస్తే చాలు చంద్రన్న కానుకల పేరిట సంక్రాంతి పండుగకు సంబంధించిన కొన్ని నిత్యావసర సరుకులను పంపిణీ చేసేవారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గోధుమపిండి బెల్లం నెయ్యి వంటి సరుకులను ఉచితంగా అందజేశారు.
ఇలా హిందువులకు సంక్రాంతి కానుక ముస్లింలకు రంజాన్ క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉచిత కానుకలను అందజేసేవారు అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడంతో గతంలో మాదిరిగా ఈసారి కూడా చంద్రన్న సంక్రాంతి కానుకలను రాష్ట్ర వ్యాప్తంగా అందచేస్తారని అందరూ భావించారు అయితే ఈసారి మాత్రం చంద్రన్న సంక్రాంతి కానుక లేనట్టేనని తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఉచిత కానుకలను అందించడం కోసం ప్రతి ఏడాది రూ.287 కోట్లు ఖర్చు చేసేవారు. రాష్ట్రంలో మొత్తం కోటి 30 లక్షల మంది కార్డుదారులకు ఆరు రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ సరుకులను పంపిణీ చేసే ఆలోచనలో సర్కార్లేదని తెలిసింది. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఈపాటికి అధికారకంగా ప్రకటించడమే కాకుండా జనవరి ఒకటవ తేదీ నుంచే ఉచిత సరుకులను పంపిణీ చేసేవారు.
సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం అవసరమయ్యే నిత్యావసర సరుకులైన నూనె, నెయ్యి, సెనగపప్పు, బెల్లం, గోధుమపిండి వంటి సరుకులను పంపిణీ చేసేవారు.ఒక్కోకార్డుదారుకి రూ.220 విలువ గల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు. అప్పట్లో ఈ పథకం కింద రూ.287 కోట్లను ప్రభుత్వం వెచ్చించేది. అయితే ఇప్పుడు కార్డుదారుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. ఈ క్రమంలోనే ఇలాంటి కానుకలను ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది.
