Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం 2024లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు ప్రధాన కారణం తానే అని, కూటమి జత కట్టడం కోసం కేంద్రంలో బీజేపీ పెద్దలను ఒప్పించడానికి తల ప్రాణం తోకకి వచ్చిందన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు వినిపించిన పరిస్థితి! తాజాగా పిఠాపురంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్.. కూటమిని కట్టడం కష్టం, కూలగొట్టడం ఈజీ అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. మరో వైపు లోకేష్ నుంచి ‘సొంతిల్లు, కిరాయి ఇల్లు’ అనే కామెంట్లు వచ్చాయి. దీంతో.. పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఏపీలో నాడు (2014), నేడు (2024) ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం తానే అని పవన్ నొక్కి నొక్కి చెప్పాలనుకుంటున్నారా..?
ఈ క్రమంలో 2024 ఎన్నికలకు ముందు తాను యువగళం పాదయాత్ర చేసి, కూటమి విజయంలో కీలక భూమిక పోషిస్తే.. ఆ క్రెడిట్ పవన్ తన ఖాతాలో వేసుకుంటున్నారని లోకేష్ భావిస్తున్నారా..?
తాజాగా కూటమి కట్టడం కష్టం.. కూల్చడం ఈజీ అనే పవన్ మాటలకు అర్ధం.. 2029లో కూటమి వద్దని టీడీపీ వాళ్లు భావిస్తున్నారనే విషయం వేగుల ద్వారా పవన్ కు తెలిసిందా..?
1999లో మాత్రమే మనం రెండోసారి గెలిచాం.. ఆ చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనపై ఉంది.. సొంతిల్లు కంటే కిరాయి ఇల్లుపై దృష్టి పెడుతున్నాం అంటూ చేసిన కామెంట్లకు అర్ధం.. కూటమి లేకుండా టీడీపీ సొంతంగా పోటీ చేసి, అధికారంలోకి రావాలనేదే లోకేష్ ఆలోచనా..?
2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి గెలవడానికి కారణం తాను చేసిన ‘పోటీ చేయని త్యాగమే’ అనే మీనింగ్ వచ్చేలా కామెంట్లు పవన్ నుంచి వినిపించిన సంగతి తెలిసిందే! ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలైన పరిస్థితి! ఈ క్రమంలో 2024లో మూడు పార్టీలు జత కట్టడానికి కారణం తానే అని, అది తన కష్టమే అని, తానే ఢిల్లీ అంతా తిరిగి బీజేపీ పెద్దలను ఒప్పించానని పవన్ పలుమార్లు చెప్పుకున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో… లోకేష్ చేసిన, పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలన చర్చకు దారితీస్తున్నాయి.

తాజాగా పిఠాపురంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో పవన్ ఫైరింగ్ కామెంట్లతో పాటు…. ‘కూటమిని కట్టడం కష్టం, కూల్చడం ఈజీ’ అని అంటూ.. ‘కూటమి పొత్తును నాయకులు బలహీనం చేసే ప్రయత్నం చేయొద్దని’ కీలక వ్యాఖ్యలు చేశారు! ఇదేదో రెగ్యులర్ గా అన్న వ్యాఖ్యలే అని సర్ధుకునే లోపు లోకేష్ నుంచి ఓ కీలక కామెట్ తెరపైకి వచ్చింది! అది కూడా పూర్తిగా టీడీపీ నేతలు ఉన్న సమావేశంలో!!
ఇందులో భాగంగా… నూతన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు జోనల్ కో-ఆర్డినేటర్లతో ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… సొంతిల్లు, కిరాయి ఇల్లు అని అన్నారు! దీంతో.. కూటమి విషయంలోనో.. చంద్రబాబు తర్వాత కూటమిలో పవన్ కే అటు మీడియా, పలువురు ప్రజానికం ప్రాధాన్యత ఇస్తున్నారనే సందేహంతోనో.. లోకేష్ అసంతృప్తిగా ఉన్నారా ఏమిటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!
ఇందులో భాగంగా… సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలా పార్టీ బలపడాలనేది ఆయన ఆకాంక్ష అని.. సొంతిల్లు కంటే కిరాయి ఇల్లుపై దృష్టి పెడుతున్నామనే లోకేష్ మాటలకు అర్ధం.. జనసేన, బీజేపీలపై ఆధారపడడానికే మనం ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఈ ధోరణిలో మార్పు రావాలని.. టీడీపీ నేతలు గట్టిగా నిలబడి ఈ సారి సొంతంగా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో లోకేష్ ఉన్నట్లున్నారని అంటున్నారు పరిశీలకులు!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… కూటమి రాజకీయాలు ఎప్పుడు శాస్వతంకాదు! ప్రధానంగా చంద్రబాబుతో దోస్తీ చేసిన వాళ్లు ఆ తర్వాత మళ్లీ గ్యాప్ ఇవ్వకుండా కలిసింది లేదని అంటారు! ఉదాహరణకు బీజేపీతో, రాష్ట్ర విభజనకు ముందు టీఆరెస్స్ తో, మళ్లీ బీజేపీతో, ఆ తర్వాత జనసేనతో.. ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న చరిత్రను కలిగి ఉన్నారు!
దీంతో… వచ్చేసారి మళ్లీ బీజేపీ, జనసేన తమతో కలిసే ప్రయత్నం చేస్తారనే విషయంపై లోకేష్ ను నమ్మకం లేకో, ఎందుకైనా మంచిదనో కానీ… సొంత కాళ్లపై నిలబడాలని పార్టీ నేతలకు సూచించారని పలువురు అభిప్రాయపడుతున్నారు! ఏది ఏమైనా.. ఈ విషయంలో లోకేష్ నిర్ణయం మంచిదే అని ఈ సందర్భంగా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే క్షేత్ర స్థాయిలో అంతా కలిసి రావాలని చెబుతున్నారు!
ఏది ఏమైనా అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా కాకమునుపే బలమైన కూటమి ప్రభుత్వంలోని పార్టీల గురించి ఈ తరహా చర్చలు తెరపైకి రావడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చలకు స్వాగతం పలుకుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు!

