బస్సు ఎక్కితే ఇంటికి చేరుతామా.. సంక్రాంతి వేళ ఏపీలో భయంకర ఘటన..!

సంక్రాంతి పండుగకు సొంతూళ్ల బాట పడుతున్న వేళ, బస్సు ఎక్కితే సురక్షితంగా ఇంటికి చేరుతామా.. అన్న ప్రశ్న మళ్లీ ప్రజల మనసుల్లో మెదిలేలా చేసింది ఓ ప్రమాద ఘటన. తెలుగు రాష్ట్రాల ప్రజలు కుటుంబంతో కలిసి ఏడాదిలో ఒక్కసారి జరుపుకునే పెద్ద పండుగ ఆనందం మధ్యలోనే, బస్సు ప్రయాణాలపై భయాన్ని పెంచే సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

బుధవారం తెల్లవారుజామున కొవ్వూరు పట్టణంలోని ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఈ బస్సు ఫ్లైఓవర్ పైకి చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోవడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులోని సెల్ఫ్ మోటార్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మంటలు గమనించిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే రోడ్డుపక్కకు నిలిపివేశాడు. అతడి చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ సూచనలతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది క్షేమంగా కిందికి దిగిపోయారు. ఎవరికి ప్రాణహాని జరగకపోవడం అందరికీ ఊరటనిచ్చే అంశంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రత్యేక పరికరాలతో చేసిన ప్రయత్నాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ట్రావెల్స్ సంస్థకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా సుమారు రూ.80 లక్షల మేర నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని వారిని ప్రత్యామ్నాయ బస్సులో విశాఖపట్నం వైపు పంపించారు. సంక్రాంతి ప్రయాణాల సమయంలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. బస్సుల భద్రత, నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.