Tirumala: తిరుమలలో రథసప్తమి మహోత్సవాలు.. ఆ రోజు నుంచి దర్శనాలపై ఆంక్షలు..!

తిరుమలలో ఏడాదిలో ఒకసారి మాత్రమే వచ్చే అత్యంత వైభవోపేతమైన రథసప్తమి మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 25న శ్రీవేంకటేశ్వర స్వామివారు సప్తవాహనాలపై విహరిస్తూ మాడవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం నుంచి రాత్రివరకు ఒకే రోజు ఏడు వాహన సేవలు జరగనుండటంతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక కళతో కదలాడనుంది.

రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రత, క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో దర్శన విధానంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. రథసప్తమి రోజు స్వామివారి వాహన సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, 24వ తేదీన తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను కూడా పూర్తిగా నిలిపివేసింది.

రథసప్తమి రోజున ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలతో కొనసాగనున్నాయి. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించనుండగా, రాత్రి చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది భక్తులు తరలిరానున్నారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలతో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, చిన్నారుల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలూ ఈ రోజు ఉండవని స్పష్టం చేసింది. తిరుపతిలో జనవరి 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేయడంతో పాటు, ప్రొటోకాల్ వీఐపీలకు మినహా సిఫార్సు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. భక్తులంతా ఈ మార్పులను గమనించి, టీటీడీ సూచనలకు అనుగుణంగా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.