రచన- దర్శకత్వం : మారుతీ
తారాగణం : ప్రభాస్, మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్, జరీనా వాహబ్, సునీల్ దత్, సత్య, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను
సంగీతం : తమన్, చాయాగ్రహణం : కార్తీక్ పళని
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు : టిజి విశ్వనాథ్, వివేక్ కూచిభొట్ల, ఇషాంత్ సక్సేనా
విడుదల : జనవరి 8, 2026
The Raaja Saab Movie Review: పానిండియా స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాల హిట్స్ తర్వాత, ’సాహో’, ‘రాదేశ్యాం’, ‘ఆదిపురుష్’ వంటి మూడు వరస ఫ్లాపు లెదుర్కొని, తిరిగి ‘సాలార్’, ‘కల్కి’ అనే రెండు వరస హిట్స్ తో తేరుకున్నాక, రూటు మార్చి ఇక యాక్షన్ సినిమాలకి దూరంగా ఎంటర్ టైనర్ లో నటించాలని నిర్ణయించుకున్నాడు. దీనికి దర్శకుడు మారుతితో చేతులు కలిపాడు. దర్శకుడు మారుతీ ప్రభాస్ కోసం హార్రర్ కామెడీని సిద్ధం చేశాడు. హార్రర్ కామెడీలు ముగిసిపోయిన అధ్యాయం. వాటిలో చూపించడానికి కొత్తగా ఏమీ వుండదు. అవే హార్రర్, అదే కామెడీల టెంప్లెట్ లో అరిగిపోయిన సినిమాలివి. మరి దీన్ని పానిండియా స్థాయిలో తీయాలనుకున్నప్పుడు ప్రభాస్ తో చేసిన ప్లాటినం స్టాండర్డ్ కృషి ఏమిటి? సంక్రాంతి పండుగ సినిమాగా ఇదెంత వరకూ అలరిస్తుంది? ఈ విషయాలు తెలుసుకుందాం…

కథేమిటి?
రాజు (ప్రభాస్) నానమ్మ గంగవ్వ (జరీనా వాహబ్) తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉంటాడు. గంగవ్వకి అల్జైమర్స్ వ్యాధి వల్ల జ్ఞాపక శక్తి సరిగ్గా వుండదు. ఆమెకి తన భర్త కనకరాజు (సునీల్ దత్) ఏమైపోయాడో గుర్తుండదు. రాజుకి, గంగవ్వకి అనిత (రిద్దీ కుమార్) తోడుగా వుంటుంది. అయితే గంగవ్వ భర్త ఎక్కడున్నా అతడి దగ్గరకి వెళ్ళాలని వుంటుంది. భర్త కనకరాజు, అంటే రాజు తాత, కొన్నేళ్ళ క్రితం తన ఆస్తిపాస్తుల్ని దోచుకెళ్ళిన గంగరాజు (సముద్రకని) ని పట్టుకునే పనిలో ఎక్కడో ఉంటాడు. ఇక రాజు నానమ్మ మాట కాదనలేక తాతని వెతకడానికి బయల్దేరతాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లో బ్రెస్సీ(నిధీ అగర్వాల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఇంతలో గంగరాజు మనవరాలు భైరవి (మాళవికా మోహనన్) కలుస్తుంది. ఈ ముగ్గురూ కనకరాజు కోసం వెతికి, అతను నరసాపూర్ ఫారెస్ట్ లో ఒక కోటలో ఉంటున్నాడని తెలుసుకుంటారు.
ఇప్పుడేం జరిగింది? ఆ కోటలో రాజు తన తాతని కలిశాడా? నానమ్మ కోరిక తీర్చాడా? ఆ కోటలో వున్న దెయ్యం ఎవరు? రాజు తాత కనకరాజు వెనుకున్న కథేమిటి? దేవనగరి సామ్రాజ్యం జమిందారిణి గంగాదేవి రాజు నానమ్మ గంగవ్వగా ఎలా మారింది? దేవనగరి సామ్రాజ్యంలోని సంపదనంతా దోచుకుంది ఎవరు? దీంతో గంగరాజుకున్న సంబంధమేమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ?
పైన చెప్పుకున్నట్టు హార్రర్ కామెడీలు ముగిసిపోయిన అధ్యాయం. వాటిలో చూపించడానికి కొత్తగా ఏమీ వుండదు. అవే హార్రర్, అదే కామెడీల టెంప్లెట్ లో అరిగిపోయిన సినిమాలివి. అయితే ఇందులో పానిండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నప్పుడు, ప్లాటినం స్టాండర్డ్స్ తో తీయాల్సింది రోల్డ్ గోల్డ్ గోలగా చేసి సరిపెట్టారు. దర్శకుడు మారుతీ తను తీసే మీడియం రేంజి సినిమాల కథతోనే, ప్రభాస్ ని చిన్న హీరో స్థాయికి దించి అన్యాయం చేశాడు. విషయం లేని కథకి సైకాలజీ, మెటాఫిజిక్స్, ఆకల్ట్, హిప్నాటిజం, పారెలల్ వరల్డ్ అంటూ ఏవేవో శాస్త్రాలు విప్పి అయోమయంలో పడేశాడు. ఒక చోట ప్రభాస్ తలపట్టుకుని ‘బుర్రంతా పిచ్చెక్కి పోతోంది’ అంటాడు. ఇదే ప్రేక్షకుల పరిస్థితీ కావొచ్చు!
పాత కాలం కామెడీకి నవ్వేరాదు, హార్రర్ దృశ్యాలకి భయమే కలగదు, ముగ్గురు హీరోయిన్లతో రోమాంటిక్ ట్రాక్స్ కూడా డిటో. క్లయిమాక్స్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ తప్పితే ఈ సినిమాలో కూర్చోబెట్టే విషయమే లేదు! ఒక సరైన స్క్రీన్ ప్లేగానీ, స్ట్రక్చర్ గానీ లేని ఇష్టానుసారం చేసుకుంటూ పోయిన.

కథ!
ఫస్టాఫ్ సంజయ్ దత్ పాత్రని పరిచయం చేయడంతో ప్రారంభమవుతుంది. ప్రారంభంలో దీని తాలూకు హార్రర్ దృశ్యాలు సినిమాపై నమ్మకాన్ని పెంచుతాయి. ఆ తర్వాత వేరే చోట ప్రభాస్ నానమ్మతో జీవితం, నానమ్మ తాత కోసం తపించడం, రిద్దీ కుమార్ తొ ప్రభాస్ రొమాన్స్ వగైరా సాగుతూ, ప్రభాస్ హైదరాబాద్ చేరుకోవడం, మళ్ళీ అక్కడ హీరోయిన్స్ తో రొమాన్స్ సాగుతూ, కథ ఫ్లాట్ గా నడుస్తుంది. రోమాన్స్ లో అవుట్ డేటెడ్ కామెడీ బాగా దెబ్బతీసింది. ఇలా ప్రభాస్ ఇంటర్వెల్లో కోట లోకి ప్రవేశించే వరకూ ఫస్టాఫ్ అసంతృప్తికి గురి చేస్తుంది. దీనికి ప్రధానకారణం మారుతీ రచన, దర్శకత్వమే! ఇంటర్వెల్లో మాత్రం కథలో విషయం వున్నట్టు అన్పిస్తుంది.
సెకండాఫ్ లో ఆ విషయం కూడా బలహీనపడి పోతుంది. అదే రొటీన్ గా కోటలో హార్రర్ దృశ్యాలు, పాతకాలం కామెడీ, వీటితోపాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. ఏ సీనులో కూడా కొత్త అయిడియాలేం లేవు. చిరాకు పెట్టే పాత మూస పద్ధతే. ఇక ప్రభాస్ తాత సమస్య తీర్చి, దీనికి వ్యతిరేక శక్తులతో పోరాటం జరపడం క్లయిమాక్స్. ఈ క్లయిమాక్స్ లో యాక్షన్ ఎపిసోడ్ అంత బాగా మిగతా సినిమా కూడా ఉండుంటే కనీసం ఫర్వాలేదనే స్థాయిలో వుండేది ఈ ప్రతిష్టాత్మక పానిండియా మూవీ. దీని వైఫల్యానికి పూర్తి బాధ్యత సరైన విజన్ లేని మారుతీయే వహించాలి!

నటనలు- సాంకేతికాలు?
ప్రభాస్ యాక్షన్ పాత్రలు వదిలేసి తన పాత రోజుల్ని గుర్తు చేస్తూ కామెడీ రోల్ చేయడం వరకూ ఓకే. అయితే కామెడీయే ఇటు క్లాస్ కి, అటు మాస్ కీ, ఇంకా అటు ప్రభాస్ కీ మింగుడుపడని వ్యవహారంగా తేలింది. ఒక్క సీనులో కూడా ఈలలు పడే పంచ్ లేదు. మాస్ మూవీకి ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది. కథకి హీరోగా ప్రభాస్ కన్ఫ్యూజన్ లో వున్నట్టు కనిపిస్తాడు తను ఏం కథ నటిస్తున్నాడో అర్ధం గానట్టు. ఒక చోట జుట్టు కూడా పీక్కుంటాడు. ప్రభాస్ ఇంతవరకూ నటించిన అన్ని సినిమాలకంటే అట్టడుగు స్థాయికి గ్రాఫ్ పడిపోయిన సినిమా ఇదే. కనీసం ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ కూడా పనికిరాలేదు.
ఇక హీరోయిన్లు ముగ్గురూ గ్లామర్ ప్రదర్శనలకి, కాస్ట్యూమ్స్ ప్రదర్శనలకీ తప్ప తమ పాత్రల కోసం గానీ, నటనల కోసం గానీ వున్నట్టు అన్పించరు. తాత పాత్రలో సంజయ్ దత్ సరే, ఇది అతన్నుంచి ఆశించే స్థాయి మాత్రం పాత్ర కాదు. సత్య చేసిన కామెడీ మాత్రం నవ్విస్తుంది. వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను నవ్వించే ప్రయత్నం చేశారు. సప్తగిరి కూడా కాసేపు కనపడతాడు, గంగరాజుగా సముద్ర కనిది కాసేపు కనిపించే గెస్ట్ రోల్. నానమ్మగా జరీనా వాహబ్ పాత్రలో లీనమై నటించింది. కాస్త కదిలించేట్టు వుంది ఆమె నటన సెంటిమెంట్ల బలంతో.

సాంకేతికంగా చూస్తే, తమన్ సంగీతంలో పాటలన్నీ అత్యంత బలహీనం. వీటికి ప్రభాస్ డాన్సు లొక్కటే రక్ష అన్నట్టుగా వున్నాయి. బిజీఎం ఒక్కటే బలంగా, ఎఫెక్టివ్ గా వుంది. అయితే దీని వల్ల హార్రర్ దృశ్యాల స్థాయి ఏం పెరగలేదు. అది సీన్ల లోపం. కార్తీక్ పళని కెమెరా వర్క్, వీఎఫ్ఎక్స్ వంటి విజువల్ ఆర్ట్స్ ఆద్యంతం ప్రభావ శీలంగా వున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ మాత్రం బోరు కొట్టే సన్నివేశాలతో మూడు గంటలపైనా ఓపికని పరీక్షించేలా సాగింది!
చివరిగా చెప్పుకుంటే, ప్రభాస్ కి మారుతితో రాంగ్ కాంబినేషన్. తన స్టార్ డమ్ కీ, మారుతీ టాలెంటుకీ పొంతనే లేదు. తన స్థాయికాని కథతో, పాత్రతో, దర్శకత్వంతో ప్రభాస్ ఈ సంక్రాంతి సినిమాతో తీవ్ర భంగపాటు కి గురికాక తప్పలేదు!
రేటింగ్ : 2 / 5

