బంగ్లాదేశ్‌ను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ దారుణ హత్యకు కుట్ర పన్ని అమలు చేసిన ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యాసిన్ అరాఫత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లు పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక బృందాలు ఇవాళ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం, మాజీ ఉపాధ్యాయుడైన అరాఫత్ ఈ హత్య వెనుక కీలక పాత్ర పోషించాడు. మత దూషణ ఆరోపణలను ఆసరాగా చేసుకొని స్థానికంగా గుంపును రెచ్చగొట్టడమే కాకుండా, దీపూ దాస్‌పై దాడి జరగడానికి పూర్తిస్థాయిలో ప్రణాళిక రచించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దాస్‌ను స్వయంగా సమీపంలోని కూడలికి ఈడ్చుకెళ్లి, అక్కడ హింసాత్మక మూకకు అప్పగించాడన్న ఆరోపణలు అతడిపై ఉన్నాయి.
ఈ ఘోర ఘటన 2025 డిసెంబర్ 18న మైమెన్‌సింగ్ జిల్లాలో చోటు చేసుకుంది. వస్త్ర పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న 27 ఏళ్ల దీపూ దాస్‌ను ఫ్యాక్టరీ సూపర్‌వైజర్లు బలవంతంగా రాజీనామా చేయించి, కార్యాలయం నుంచి బయటకు లాక్కెళ్లారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆగ్రహంతో ఉన్న గుంపు అతడిని దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించింది. ఈ ఘటనకు సహోద్యోగుల్లో కొందరు కూడా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.
హత్య జరిగిన వెంటనే అరాఫత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన సామాజిక పలుకుబడిని ఉపయోగించి కొద్ది సేపులోనే గుంపును సమీకరించి, మత దూషణ ఆరోపణను ప్రాణాంతక మూకదాడిగా మార్చాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేయగా, అరాఫత్ అరెస్ట్‌తో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.
దీపూ దాస్ హత్య ఘటన బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. ఈ దారుణాన్ని అనేక దేశాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండించాయి. న్యాయం కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో, ప్రధాన నిందితుడి అరెస్ట్ బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.
