ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒంటరిగా బరిలోకి దిగుతున్న వైసీపీ సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీ – జనసేన (అన్నీ అనుకూలంగా జరిగితే బీజేపీ) కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం అత్యంత కీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా జనసేనకు ఇటీవల కాస్త బలం పెరిగిందని చెప్పుకుంటున్న వేళ.. ఆ పార్టీ నుంచి పోటీచేయడానికి కూడా అభ్యర్థులు ముందుకువస్తున్నారు. ఈ సమయంలో ఒక సీటు ఆసక్తిగా మారుతూ గతాన్ని గుర్తుకు తెస్తుంది.
పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీట్ల విషయంలో జనసేన 50 – 60 అంటుంటే.. చంద్రబాబు మాత్రం 20 – 25 అంటున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే కాపు ఓటు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అయ్యే ఛాన్సే లేదని కాపు సామాజికవర్గానికి చెందిన పెద్దలు నొక్కి చెబుతున్నారు. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… ఎంపీ సీట్ల విషయంలో కూడా చిన్న సమస్య వచ్చిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేనకు రెండు సీట్లు కేటాయించింది టీడీపీ!
ఇందులో భాగంగా మచిలీపట్నం, కాకినాడ లోక్ సభ స్థానాలను జనసేనకు కేటాయించారు చంద్రబాబు. అయితే… తమకు మరో ఎంపీ సీటు కావాలని అడుగుతున్నారంట పవన్. ఇందులో భాగంగా తన అన్న నాగబాబు కోసం అనకాపల్లి లోక్ సభ టిక్కెట్ కేటాయించాలని రిక్వస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో పవన్ కాస్త గట్టిగానే బాబుని బ్రతిమాలుతున్నారని అంటున్నారు! అయితే ఈ విషయంలో బీజేపీతో పొత్తు అనంతరం బాబు వరం ఇచ్చేది లేనిదీ తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… అనకాపల్లి లోక్ సభ స్థానం మెగా ఫ్యామిలీకి కలిసి రాదని అంటూ గతం గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో అందుకు కారణమైన విషయాలనూ స్పష్టం చేస్తున్నారు. దీంతో… నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేస్తే వచ్చే ఇబ్బందులను చెబుతున్నారు. ఇదే సమయంలో పరోక్షంగా పరిష్కారాలనూ ప్రస్థావిస్తున్నారని తెలుస్తుంది. ఇంతకూ ఆ సమస్య ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!
ఒకసారి గతానికి వెళ్తే… 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేశారు. అయితే ఆనాడు లోకల్ నినాదం పెద్ద ఎత్తున రావడంతో పాటు వైఎస్సార్ వేవ్ కూడా ఉండడంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబ్బం హరి గెలిచారు. అల్లు అరవింద్ మూడోస్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఆయన ఓటమికి “నాన్ లోకల్” అంశం కూడా ప్రధాన కారణం అని అంటున్నారు పరిశీలకులు!
ఇందులో భాగంగా అనకాపల్లిలో ప్రధానంగా నాన్ లోకల్ అంశం కూడా ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో అనకాపల్లి జనాలకు నాన్ లోకల్ క్యాండిడేట్స్ పై ఏమాత్రం ఆసక్తి చూపించరని చెబుతున్నారు. ఈ సమయంలో… హైద్రాబాద్ లో నివాసం ఉండే నాగబాబుని అనకాపల్లి ప్రజానికం ఏమేరకు ఆదరిస్తుందనేది వేచి చూడాలి. ఇదే సమయంలో 2009లో అల్లు అరవింద్ కు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.