నాగులచవితి రోజు ఇలా చేయండి !

కార్తీకమాసంలో శుద్ధవిదియను నాగులచవితిగా చేసుకుంటారు. ఈపండుగ ఈ ఏడాది నవంబర్ 18న అంటే బుధవారం నాడు. దీని గురించిన విశేషాలు తెలుసుకుందాం…
దీపావళి అమావాస్య తరువాత వచ్చే నాలగోరోజు.. అంటే కార్తీకశుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగా జరుపుకొంటారు. నవంబర్ 18 బుధవారం నాడు నాగుల చవితి. కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుద్ధ చతుర్థి నాడు నాగులచవితిని నిర్వహించుకొంటారు.

నాగుల చవితినాడు ఏం చేయాలి ?

ఈరోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. అవకాశం ఉంటే శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందార పూలు అవి లభించకుంటే ఎర్రటి పువ్వులు కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. నాగులచవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి, నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిరి ఉండలు (నువ్వులతో చేస్తారు), అరటిపళ్ళు, తాటి బుర్ర గుజ్జు, తేగలు మున్నగునవి స్వామికి నివేదించాలి. నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని పెద్దల విశ్వాసం.
స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. పాలను పుట్టలో పోస్తూ “నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నాయింటి వారల ఆప్తుల మిత్రుల నందరను నేలు పడగ త్రొక్కిన పగ వాడనుకోకూ నడుము త్రొక్కిన నా వాడనుకొనుమూ తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో! నూకనిచ్చెదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ము” అంటూ ఈ విధంగా ప్రార్థిస్తారు.