తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం కీలక మార్పుల వేళ పాత విషయాలే మళ్లీ చర్చకు వస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి పెద్దల నిర్ణయం ఏవిధంగా ఉండబోతుందన్న ఆసక్తి మధ్య గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత పరిస్థితిని మరింత బయటపెట్టాయి. గ్రూపిజం, నాయకత్వ విభేదాలు, కేడర్‌ను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ఆయన బహిరంగంగా ప్రస్తావించడంతో బీజేపీలోని అసంతృప్త వర్గాలకు దిశా నిర్దేశం అయినట్లైంది.
“కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ ఎంచుకుంటే, రబ్బర్ స్టాంపుగానే ఉంటారు. జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది,” అనే రాజాసింగ్ మాటలు నేరుగా పార్టీలోని ప్రస్తుత నడతపై ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నాయి. గతంలో ఒక అధ్యక్షుడు తనవంతు వర్గాన్ని నిర్మించి పార్టీకి నష్టం చేశాడన్న ఆరోపించగా.. అదే పద్ధతి పునరావృతమైతే… వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి క్షీణించడమే కాదు, రాజకీయంగా పునర్నిర్మాణం కూడా కష్టమవుతుందని అన్నారు.
ఇక సీనియర్ నాయకులకు స్వేచ్ఛ లేకపోవడమే పార్టీ ఎదుగుదలకి అడ్డంకిగా మారిందని రాజాసింగ్ అభిప్రాయపడటం, పార్టీ మార్గదర్శక తత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని సూచిస్తోంది. నామినేటెడ్ పదవుల విషయమై కూడా ఆయనే కాక ఇతర సీనియర్ నేతలంతా బాధను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీని సరికొత్త దిశగా నడిపించాలంటే, ఈ అసంతృప్తిని సూటిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
రాజాసింగ్ చెప్పినట్లుగా, ఇదంతా వ్యక్తిగత వ్యాఖ్యలుగా కాకుండా, కార్యకర్తల గుండెల్లో ఉన్న మాటల పునరుక్తిగా చూడాల్సిన అవసరం ఉంది. మీడియా ముందు మాట్లాడడం రాజకీయంగా వివాదాస్పదమైనా, ఈ వ్యాఖ్యలే పార్టీ పెద్దలను లేవనెత్తే అవకాశం కల్పిస్తే… దానికి మించిన లాభం మరొకటి ఉండదు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో జాతీయ నేతలు జోక్యం చేసుకొని సమగ్ర సమీక్షతో నిర్ణయం తీసుకుంటేనే బీజేపీకి తెలంగాణలో చక్కటి మార్గం అందుతుంది.