టిల్లు సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధూ జొన్నలగడ్డ, ఇప్పుడు జాక్ సినిమాతో తనను కొత్త కోణంలో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌పై హైప్ భారీగా లేకపోయినా, ప్రమోషన్‌లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కొత్తగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు నెమ్మదిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, తాజా కిస్ సాంగ్ వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమా సంగీత విభాగం ఓ ఆసక్తికరమైన ప్రయోగంగా మారింది. ఒకే సినిమాలో వేర్వేరు సంగీత దర్శకులను ఎంచుకోవడం భాస్కర్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. పబ్లో నెరుడా పాటకు అచ్చు రాజమణి సంగీతమందించగా, కిస్ పాటను సురేష్ బొబ్బిలి స్వరపరిచాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు సామ్ సిఎస్ తీసుకున్నట్లు సమాచారం. మ్యూజిక్, కథనానికి ప్రధాన బలం ఇవ్వాలని దర్శకుడు భావించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదంతా వర్కౌట్ అవ్వాలంటే సిద్ధూ కెరీర్‌లో మరో మేజర్ హిట్ రావాల్సిన అవసరం ఉంది.
అయితే, జాక్ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. అదే రోజు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సన్నీ డియోల్ జాత్ లాంటి పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రాలకు భారీ పబ్లిసిటీ ఉండటం ఖాయం. పైగా, సిద్ధూ జాక్ విజయాన్ని బట్టి తెలుసు కదా, కోహినూర్ లాంటి అతని తర్వాతి ప్రాజెక్టుల బిజినెస్ వాల్యూ కూడా పెరుగుతుందో లేదో నిర్ణయించబడుతుంది. మొత్తానికి, టిల్లు ఫ్రాంచైజీ ఇమేజ్‌ను పక్కనపెట్టి, సిద్ధూ జాక్ తో కొత్త తరహా విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. యూత్‌తో తన ఫాలోయింగ్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, మరింత విస్తరించుకోవాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవాల్సిందే. మరి జాక్ జాతకం ఏమవుతుందో చూడాలి.