The Suspect Review: మర్డర్ మిస్టరీ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’

గతం నుండి ఎప్పటికీ మర్డర్ మిస్టరీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు. నిర్మాత కిరణ్ కుమార్ దీనిని నిర్మించారు. ఇందులో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్ పై తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి.

కథ: ప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ను ఇన్స్ పెక్టర్ అర్జున్(రుషి కిరణ్)కి అప్పజెప్పుతారు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూవుంటుంది. అయితే అర్జున్ కి ఈ హత్యకేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో తనకి ఎదురయ్యే ప్రతి వ్యక్తీ సస్పెక్ట్ గానే కనిపిస్తూ వుంటారు. ఈ క్రమంలో తన ప్రేయసి మీరా (శ్వేత)ను కూడా అనుమానించాల్సి వస్తుంది. అలాగే తన సూపరియర్ అయిన పోలీసు అధికారిని, తన స్నేహితులను ఇలా ప్రతి ఒక్కరినీ సస్పెక్ట్ చేయాల్సి వస్తూ వుంటుంది. మరి ఈ క్రమంలో అర్జున్ కి ఎదురైన సవాళ్లు ఏంటి? ప్రత్యూషను హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: క్రైం థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం ఇలాంటి సినిమాలు థియేటర్లలో ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేస్తూనే వున్నాయి. ఓ యూనిక్ కాన్సెప్ట్ ను ఎంచుకుని దర్శక, నిర్మాతలు ఇలాంటి సినిమాలను ఎంతో క్వాలిటీగా నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓ చిన్నపాటి లైన్ ను ఎంచుకుని.. దాని చూట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకుని సినిమాను సెల్యులాయిడ్ పై ప్రేక్షకాదరణ పొందేలా రూపొందిస్తున్నారు. అందుకే వీటికి మంచి స్పందన లభిస్తోంది.

తాజాగా ‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేస్తూనే ఉంటుంది. ఒక క్రైం సీన్ చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే… చివరి వరకూ హంతకులెవరు అన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్ తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. కానీ మరోకోణంలో వారు కాదు… మరొకరున్నారనేది చివరి వరకూ కొనసాగుతూ వస్తుంది. ఇక ప్రీక్లైమాక్స్ లో అసలు హంతకులు ఎవరు అనేది తెలియడంతో… ఆ పాత్రపై జాలి కలగడంతో పాటు… ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టుంది. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదని… ముఖ్యంగా విద్యార్థులుగా వున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే… వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి… ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది ఇందులో చూపించారు. సినిమా మొత్తం ఓ మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరుగుతూ ఆడియన్స్ ను ప్రతి సెకెనూ ఎంగేజ్ చేస్తుంది సినిమా.

ఫస్ట్ హాఫ్ లో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, వారి లవ్ బ్రేకప్ తరువాత మళ్లీ కలుసుకోవడం లాంటి సన్నివేశాలతో ఇంటర్వెల్ కార్డ్ వేసి… ఆ తరువాత హీరో మిత్రుడు, తోటి సహచరుడు సదా శివ చనిపోవడంతో సినిమా సెకెండాఫ్ లో ఊపందుకుంటుంది. ఇక చివరి దాకా సినిమాను ఆసక్తికరమైన మలుపులతో నడిపించి చివరకు ముగించడంలో దర్శకుడు విజయం సాధించారు.

కొత్తవారైన హీరో రుషి కిరణ్… ఇన్స్ పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెప్పించారు. క్రైంను చేధించే క్రమంలో డిపార్ట్ మెంట్ వారు చూపించే యారెగెన్సీని ఇందులో బాగా చూపించారు. కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత కూడా గ్లామరస్ గా కనిపించింది. హోమ్లీ లుక్ లో మెప్పించింది. ప్రత్యూష పాత్రలో నటించిన రూప కూడా బాగా చేసింది. అలాగే లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హీరో సహచరునిగా నటించిన మరో పోలీసు అధికారి పాత్ర మర్రెబోయిన శివకుమార్… సదా శివ పాత్రలో బాగా నటించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే చివరి వరకూ ఎంగేజింగ్ గా వుంది. దాంతో ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ గ్రాండియర్ గా వున్నాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. క్రైం థ్రిల్లర్ కి ఎలావుండాలో అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3/5