దేశవ్యాప్తంగా అందరిని కలిచివేస్తున్న మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో అనేక భయంకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. లండన్‌లో బేకరీ ఉద్యోగం చేస్తున్న సౌరభ్ (29) తన ఆరేళ్ల కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చాడు. అయితే అతడి భార్య ముస్కాన్ రస్తోగి (27), ఆమె ప్రియుడు సాహిల్ ఖాన్ (25) కలిసి ఓ పక్కా ప్లాన్ వేసి అతడిని అతి కిరాతకంగా హత్య చేశారు.
హత్యకు ముందు సౌరభ్‌కు తల్లి ఇంటి నుంచి తెచ్చిన భోజనంలో మత్తుపదార్థాలు కలిపి ముస్కాన్ ఇచ్చింది. స్పృహతప్పిన సౌరభ్‌ను బెడ్‌పై పడేసి, ఇద్దరూ హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బాత్రూంకి లాగి, సాహిల్ కత్తితో శరీరాన్ని 15 ముక్కలుగా నరిగాడు. తల, చేతులు వేరుచేసి, కవర్లలో వేసి తన ఇంటికి తీసుకెళ్లాడు. మిగిలిన భాగాలను బెడ్‌బాక్స్‌లో పెట్టి, అదేపై ముస్కాన్ ఒక రాత్రి నిద్రపోయింది.
ఇటు సాహిల్ మరుసటి రోజు ప్లాన్ మార్చి ప్లాస్టిక్ డ్రమ్, సిమెంట్, కొనుగోలు చేశాడు. అందులో శరీర భాగాలను ఉంచి మూసివేశాడు. ఈ సమయంలో డ్రమ్ నుంచి వచ్చిన దుర్వాసనతో కొందరు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిజాలు బట్టబయలయ్యాయి. ముస్కాన్ పరారవగా, కొద్దిసేపటికే ఆమె తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు లొంగిపోయింది.
ఇంతకీ ఈ హత్యకు మూలకారణం ముస్కాన్, సాహిల్ మధ్య కొనసాగుతున్న నాలుగేళ్ల వివాహేతర సంబంధమే. స్కూల్ ఫ్రెండ్స్‌గా మొదలైన పరిచయం తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో తిరిగి కలుసుకోవడంతో ప్రేమగా మారింది. సౌరభ్ తమ బంధానికి అడ్డుగా మారాడని భావించిన ముస్కాన్, భర్తను తొలగించాలనే క్రూర నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులిద్దరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.