Nomulu/Vratalu: చతుర్దశి నాడు వేకువజామునే తైలాభ్యంగన స్నానం చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. అంతేకాదు, నువ్వుల నూనెలో లక్ష్మీ కళలు ఆవహించి ఉంటాయి. చతుర్దశి తెల్లవారు జామున నువ్వులతో తలంటుకొని తలస్నానం చేస్తే లక్ష్మీప్రదం. నరక దుర్గతి నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషకాలంలో దీపారాధన చేయాలి. ఈ దీపాలు లక్ష్మీకటాక్షం కలిగించడంతోపాటు పితృదేవతలకు నరకబాధను విముక్తిచేస్తాయని నమ్మకం. దీపావళి నాడు హారతులు ప్రధానమైన వేడుక.
పుట్టింటికి వచ్చిన ఆడకూతుళ్లు ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ హారతులు ఇస్తారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ పక్రియ గురువారం సూర్యోదయానికి ముందుచేసుకోవాలని సిద్దాంతులు సెలవిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కుదరని పక్షంలో, వర్జ్యం వెళ్లిపోయిన తర్వాత ఇవ్వొచ్చు. ఏటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ ఈసారి ఒకేరోజు జరుపుకోనున్నారు. అమావాస్య తిథి గురువారం పరివ్యాప్తమై ఉన్నందున గురువారం ఉదయం హారతులు, సాయంతరం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు.
దీంతో హారతులు, లక్ష్మీపూజలు ఒకేరోజు చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులు కలిసి వచ్చాయి. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండటంతో దీపావళి గురువారమే చేసుకోవాలి. నోముల విషయంలోనూ పండితులు పలు సూచనలు చేస్తున్నారు. లక్ష్మీపూజలకు ఎలాగైతే సాయంత్రం అమావాస్య ఉండాలన్న నియమం ఉన్నదో.. నోములు నిర్వహించాలంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండాలని చెప్తున్నారు.
దీపావళి పండుగ విశేషాలలో ముఖ్యమైంది లక్ష్మీపూజలు. వ్యాపారస్తులంతా దీపావళి సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపూజలతోనే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలుపెడతారు. రాత్రిపూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. గురువారం సాయంత్రం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీపావళికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి కొత్తబట్టలు, కానుకలు సమర్పించే సంప్రదాయం తెలుగువారికి ఉంది.