Cricket Stadium: ఆంధ్ర క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేశంలోనే రెండో అతిపెద్ద స్టేడియం..ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మళ్లీ ఊపందుకుంటున్న వేళ, క్రీడా రంగానికీ అదే స్థాయిలో ప్రాధాన్యం లభిస్తోంది. ముఖ్యంగా క్రికెట్‌ను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తాజాగా అమరావతిలో 1.25 లక్షల సీటింగ్ సామర్థ్యం కలిగిన అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి పూర్తి మద్దతు లభించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం, 132,000 సామర్థ్యంతో మొదటి స్థానంలో ఉంది.

ఈ ప్రాజెక్టు అమలు కోసం అమరావతిలోని స్పోర్ట్స్ సిటీకి కేటాయించిన స్థలాన్ని కేంద్రంగా ఎంచుకున్నారు. క్రికెట్ స్టేడియం ఒక్కటే కాకుండా, దాని చుట్టూ ప్రజా రవాణా సౌకర్యాలు, ఇతర అవసరమైన మౌలిక వసతులు కూడా అందుబాటులోకి తేవాలన్న ఆలోచనలో ఏసీఏ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఐసీసీ చైర్మన్ జై షా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు.

ఇదే సమయంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ క్రికెట్ వృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించింది. విశాఖపట్నం స్టేడియాన్ని ఐపీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో మంత్రి లోకేశ్ జోక్యం కీలకంగా మారింది. అంతే కాదు, విజయవాడ, కడప, విజయనగరం నగరాల్లో క్రికెట్ అకాడమీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియాన్ని రంజీ మ్యాచ్‌లకు ఉపయోగించేలా మారుస్తామని ఏసీఏ చెబుతోంది.

రాష్ట్రంలోని అరకు, కుప్పం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో స్టేడియాల నిర్మాణం ద్వారా గ్రామీణ స్థాయిలో క్రికెట్‌ను ప్రోత్సహించాలన్న దిశగా చర్యలు చేపడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ క్రికెట్ మైదానం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం, క్రీడల పట్ల చూపుతో యువతకు కొత్త ఆశలు కలిగిస్తోంది. అమరావతి స్టేడియం రూపకల్పనతో రాష్ట్రానికి క్రికెట్ రంగంలోనూ ప్రాధాన్యం పెరగనుంది.

Public Reaction On Pawan Kalyan Comments On Chandrababu || Ap public Talk || YsJagan || TeluguRajyam