Shalini Pandey: బట్టలు మార్చుకుంటూ ఉంటే.. ఆ దర్శకుడు లోకి వచ్చేశాడు.. షాలిని పాండే షాకింగ్ కామెంట్స్

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే, మొదటి సినిమా నుంచే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, హిందీ భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే తెలుగులో నిశ్శబ్దం (2022) తర్వాత ఒక్క సినిమాను కూడా సైన్ చేయలేదు. ఇప్పుడే విడుదలకు సిద్ధంగా ఉన్న వెబ్ సిరీస్ ‘డబ్బా కార్టెల్’ ప్రమోషన్స్ సందర్భంగా ఆమె చేసిన ఓ కామెంట్ ఇప్పుడు మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయనీ, కానీ వాటిని అప్పట్లో బయటపెట్టలేకపోయానని చెప్పింది. ఇప్పుడు తన పరిస్థితే వేరుగా ఉండటంతో తాను గొంతు వినిపించాలనిపించిందని అన్నారు. “ఒక సౌత్ సినిమా చేస్తుండగా, ఒకరోజు నా కారవాన్ లో డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో డైరెక్టర్ ఒకడు అనుమతి లేకుండా లోపలకి వచ్చేశాడు. వెంటనే నేను అతనిపై కేకలు వేసాను. దాంతో అతను వెళ్లిపోయాడు. కానీ తరువాత చాలామంది నన్నే తప్పుపట్టారు. ఇలా రియాక్ట్ కాకూడదని చెప్పారు. కానీ నాకు తెలుసు, నేను చేసినది సరైనదే” అని తెలిపారు.

ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో సంచలనం రేగింది. ఆమె అలా మాట్లాడటంతో ఆ దర్శకుడు ఎవరు? ఏ సినిమాకి సంబంధించిన విషయం? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఆమె ఎవరినీ నేరుగా తప్పుబట్టకపోయినా, ఒక సౌత్ సినిమా అని చెప్పడం వల్ల ఆ అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇటీవలెనే బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇటువంటి అనుభవాలను పంచుకున్నారు. ఇప్పుడు షాలినీ పాండే చెప్పిన విషయం మరోసారి సినీ మహిళల భద్రతపై చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం షాలినీ పాండే తమిళ నటుడు ధనుష్ సరసన ‘ఇడ్లీ కడై’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో మరొకసారి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.