ఇంద్ర‌కీలాద్రి: దసరా ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన సోమవారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై వేంచేసి ఉన్న క‌న‌క‌దుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

“నిత్యానందకీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్దూతాఖిల లోకపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాళీపురాధీశ్వరీ

భిక్షాం దేహి! కృపావలంబనకరీ! మాతాన్నపూర్ణేశ్వరీ!”

శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేదే అన్నపూర్ణదేవి. నిత్రాన్నదానేశ్వరిగా, ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణదేవి తన బిడ్డలమైన మనకేకాక సకల జీవరాశులకీ ఆహారాన్నందించే తల్లి అన్న‌పూర్ణాదేవి. లోకంలో ఆకలిని తీర్చటంకన్నా మిన్న ఏదీలేదు. అందుకే అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదంటారు. అందుకే ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న క‌న‌క‌దర్గమ్మను దర్శించి తరించాల్సిందే.