వైసిపి ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉంది. ఏపి రాజధాని అమరావతిలో ఉంది. ఈమధ్యనే వైసిపి కేంద్ర కార్యాలయాన్ని అమరావతి పరిధిలోని ఉండవల్లి (తాడేపల్లి)లో నిర్మించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే హెడ్ క్వార్టర్స్ ను లోటస్ పాండ్ నుండి ఉండవల్లి ప్రధాన కార్యాలయానికి మార్చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఏపి కేంద్రంగా జరిగే వైసిపి కార్యకలాపాలన్నింటినీ ఇక నుండి ఉండవల్లి నుండే జరగనున్నాయి.
ఇంత హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిర్ణయించుకున్నారు ? ఎందుకంటే, 23వ తేదీన ఫలితాలు వచ్చేనాటికి పార్టీ కేంద్ర కార్యాలయం ఉండవల్లిలోనే ఉండాలని జగన్ నిర్ణయించారట. రేపటి ఫలితాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది వైసిపినే అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకనే లోటస్ పాండ్ నుండి మొత్తం ఫర్నీచర్ అంతా ఉండవల్లి పార్టీ కార్యాలయానికి తరలించేశారు.
21వ తేదీన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు, ముఖ్య నేతలతో సమావేశం కూడా ఉండవల్లిలోనే జరిపేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. అంతకుముందు అంటే 16వ తేదీన కౌంటింగ్ లో పాల్గొనే ఏజెంట్లకు శిక్షణ కూడా ఉండవల్లి కార్యాలయంలోనే ఇవ్వటానికి ఏర్పాట్లు జరిగాయి.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏపికి కాబోయే సిఎం తానే అని జగన్ ధీమాగా ఉన్నారు. పోలింగ్ జరిగిన విధానం, పోలింగ్ తర్వాత ఓటింగ్ సరళిపై తెప్పించుకున్న వివరాలు, చేయించుకున్న సర్వేల్లో కూడా వైసిపిదే అధికారమని తేలిందట. కాకపోతే ముందు జాగ్రత్తగా గెలుపుపై బహిరంగంగా ఎక్కడా మాట్లాడటం లేదు.
నిజానికి తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం, నివాసం రెండు నిర్మించుకున్నా ప్రస్తుతానికైతే లోటస్ పాండ్ లోనే ఉంటున్నారు. తాడేపల్లిలో ఉండటం జగన్ కు క్షేమం కాదని సూచించారట. అందుకే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. 23 తర్వాత ప్రభుత్వం మారిపోతుందన్న నమ్మకం ఉండటంతో జగన్ ధైర్యంగా ఉండవల్లికి మారిపోతున్నారు ముందుగానే.