తాజాగా వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో కలిపి చంద్రబాబునాయుడు రూ 15 వేల కోట్లు ఖర్చు పెట్టటానికి ప్లాన్ చేసినట్లు ఎంపి ఆరోపించారు. నాలుగున్నరేళ్ళ పాలనలో రూ 4 లక్షల కోట్లు దోచుకున్నట్లు విజయసాయి మండిపడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రతీ ప్రాజెక్టులోను, ప్రతీ పథకంలోను చంద్రబాబు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు మండిపడ్డారు. ఈమధ్యనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విరమణ చేసిన అజేయ కల్లం మాట్లాడుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రూ 20 వేల కోట్లకు పైగా దోపిడి జరిగినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఏపిలోని ప్రతీ నియోజకవర్గంలోను చేయాల్సిన ఖర్చును చంద్రబాబు ఇపుడే ఆయా నియోజకవర్గాలకు పంపిణీ చేసేశారట. కొందరు నమ్మకస్తుల దగ్గర ఆ డబ్బంతా దాచిపెట్టినట్లు ఎంపి చెబుతున్నారు. ఏ ఏ నియోజకవర్గాలకు ఎంతెంత డబ్బు పంపిణీ చేశారు ? ఎవరెవరి దగ్గర ఎంతెంత దాచిపెట్టారో కూడా తమకు తెలుసని విజయసాయి చెప్పటం విచిత్రంగా ఉంది. నిజంగానే అంత డబ్బు చంద్రబాబు పంపిణీ చేసిఉన్నా అదంతా ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే అని ఎలా నిరూపించగలరు ?
ఏపిలో దోచుకున్న 4 లక్షల కోట్ల రూపాయల్లో ఇపుడు తెలంగాణా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు వాటానే రూ 1200 కోట్లని విజయసాయి చెప్పారు. అందుకే మహాకూటమి తరపున ఇస్తున్న ప్రకటనల్లో చంద్రబాబునే ప్రముఖంగా చూపిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇపుడు జరుగుతున్న రాజస్ధాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు రూ 500 కోట్లు ఫండింగ్ చేసినట్లు చెప్పారు. పైగా 2019లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తన షేర్ క్రింద రూ 5 వేల కోట్లు సర్దుబాటు చేస్తామని రాహూల్ గాంధికి చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పటం కాస్త విడ్డూరంగా ఉంది.
విజయసాయి చెప్పినట్లుగా అన్ని వేల కోట్ల రూపాయల హామీలు ఇచ్చారా అన్నదే కాస్త ఆలోచించాలి. అయితే, ఇక్కడ ఓ విషయం గమనించాలి. అదేమిటంటే, కాంగ్రెస్ పార్టీని నిధుల కొరతైతే తీవ్రంగా వేదిస్తోందన్నది వాస్తవం. ఎక్కడ ఎన్నికలు జరిగినా నిధుల కొరతతో బాగా ఇబ్బందులు పడుతోంది. మొన్ననే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. అయితే, ఆ ప్రభుత్వం ఎంత కాలం అధికారంలో ఉంటుందో చూడాల్సిందే. ఇక, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ లో గనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చిందనే అనుకోవాలి.
కాబట్టి విజయసాయి చెప్పటం చూస్తుంటే కాంగ్రెస్ కు ఫండింగ్ చేస్తున్నది చంద్రబాబే అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరైన సమయంలో నియోజకవర్గాలకు పంపిన డబ్బు, ఎవరెవరి దగ్గర ఎంతుందన్న విషయాలు బయటపెడతానన్నారు. తనపై ఎటువంటి చర్యలైనా ప్రభుత్వం తీసుకోంచ్చని కూడా విజయసాయి చంద్రబాబును సవాలు చేయటం గమనార్హం.