చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయిందా ?

అలాగే ఉంది చూడబోతే. లేకపోతే తనను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అంటూ ఎవరైనా బేలగా మాట్లాడుతారా ? న్నికల ప్రచారం ముందునుండే ప్రతీరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కెసియార్, నరేంద్రమోడినే టార్గెట్ చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అవసరమున్నా లేకపోయినా జగన్ ను లక్ష్యంగా చేసుకుని అడ్డుగోలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో కూడా అదే పద్దతిని పాటిస్తున్నారు. తనను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని అన్నారంటే రాబయే ఎన్నికల సీన్ చంద్రబాబుకు అర్ధమైపోయినట్లే ఉంది.

ఒకవైపేమో ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అనే స్లోగన్ తో ఎన్నికలకు వెళతామని చెబుతూనే మరోవైపు తన రక్షణ మీదే అంటూ ప్రజలతో చెప్పుకుంటున్నారంటే ఏమిటర్ధం ? పైగా తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్దిదారులంతా పార్టీ జెండాలు పట్టుకోవాలట. పసుపు, కుంకుమ, డ్వాక్రా మహిళలు, రుణమాఫీ, సబ్సిడీ ట్రాక్టర్లు తీసుకున్న వారంతా తమ పార్టీ జెండా పట్టుకుని తిరిగితేనే తమకు ఓట్లేస్తారనే నమ్మకం తనకుంటుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

ఎవరైనా తన జోలికొస్తే ప్రజలే గుణపాఠం చెప్పాలట. చంద్రబాబుకు ఏదైనా సమస్య వస్తే ప్రజలెందుకు గుణపాఠం చెప్పాలో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఐదేళ్ళ పాలనలో టిడిపి నేతలు ఇష్టారాజ్యంగా జనాలను చావకొడితే పట్టించుకోని చంద్రబాబును ప్రజలెందుకు రక్షించుకోవాలి ?  మీకు పౌరుషం లేదా ? మీకు రోషం లేదా ? అంటూ జనాలను రెచ్చ గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలు ఐదేళ్ళుగా జనాలు వింటూనే ఉన్నారు. అందుకనే ఏ సభలో చంద్రబాబు మాట్లాడినా పెద్దగా స్పందన కనిపించటం లేదు.