ఈమె బిజెపిలోకి పోతే టిఆర్ఎస్ వాళ్లు షాక్ ఇచ్చిర్రు

రెండు నెలలుగా అనేక నాటకీయ పరిణామాల మధ్య నడిచిన భువనగిరి మున్సిపల్ రాజకీయ వివాదానికి తెరపడింది. మంగళవారం జరిగిన అవిశ్వాసంలో ప్రస్తుత చైర్మన్ సుర్వి లావణ్య ఓటమి పాలయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాల్టి లో చైర్మన్ పై మిగిలిన సభ్యులు అవిశ్వాసం పెట్టడంతో చైర్మన్ తన పదవిని కోల్పోయింది. ఆమె పదవిని రక్షించేందుకు తిరిగి బిజెపిలో చేరినా పదవి మాత్రం దక్కలేదు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం పై  తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ…

భువనగిరి మున్సిపాల్టిలో 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మంగళవారం జరిగిన అవిశ్వాసంలో 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా 8మంది అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో లావణ్య తన చైర్ పర్సన్ పదవిని కోల్పోయింది. 2014 మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరిలో అధికార టిఆర్ ఎస్ పార్టీకి ఒక్కటంలే ఒక్క సీటును కూడా గెలువలేదు. కాంగ్రెస్ , బిజెపిలు అధిక స్థానాలు గెలుచుకున్నాయి. బిజెపికి చెందిన సుర్వి లావణ్య మున్పిపల్ చైర్మన్ గా ఎన్నికయింది. ఆ తర్వాత టిఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో క్యాంపు రాజకీయాలు నడిచి చైర్మన్ తో పాటు మరికొంత మంది టిఆర్ ఎస్ లో చేరారు. గత కొద్ది రోజులుగా చైర్మన్‌కు , కౌన్సిలర్లకు మధ్య విబేధాలు నడుస్తున్నాయి. ఈ విబేధాలతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చైర్మన్ ను రాజీనామా చేయాల్సిందిగా కోరాడని తెలుస్తోంది. దానికి చైర్మన్ ఒప్పుకోలేదు. ఎలాగైనా చైర్మన్ ను దించి వేయాలని ఎమ్మెల్యే భావించారు. టిఆర్ ఎస్ లో ఉంటే తన పదవికి ఎసరు వస్తుందని భావించిన లావణ్య తన సొంత గూడు బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేరింది. దాంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విపక్షాలకు చెందిన కౌన్సిలర్లందరిని తన వైపు తిప్పుకున్నారు.

కౌన్సిలర్లందరిని కూడగట్టిన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ముందుగా కలెక్టర్ కు అవిశ్వాస నోటిసును ఇప్పించాడు. అప్పటి  నుంచి కౌన్సిలర్లందరిని తన గ్రిప్ లో పెట్టుకుని రాజకీయ చదరంగం నడిపించారు. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లను టిఆర్ ఎస్ లో చేర్చుకున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అవిశ్వాసానికి నాలుగు రోజుల ముందు నుంచి సభ్యులను మైసూరులో ఉంచి క్యాంపు రాజకీయాలు చేశారు. అవిశ్వాస సమయానికి నేరుగా కార్యాలయానికి తీసుకొచ్చి ఓటింగ్ లో పాల్గొనేలా చేశారు. అవిశ్వాసానికి మద్దతుగా 22 మంది సభ్యులు మద్దతివ్వగా, వ్యతిరేకంగా 8 మంది మద్దతిచ్చారు. అవిశ్వాసం నెగ్గటంతో చైర్మన్ గిరిని సుర్వి లావణ్య కోల్పోయింది. దీనిని బిజెపికి షాక్ గా పట్టణంలో చెప్పుకుంటున్నారు.

భువనగిరిలో టిఆర్ ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. అటువంటప్పుడు పక్క పార్టీ వారిని చేర్చుకొని చైర్మన్ గిరిని ఎలా దక్కించుకుంటారని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. డిపాజిట్లు కూడా దక్కకుండా పేలవంగా ఓడిపోయిన టిఆర్ ఎస్..  ఇతర పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి రాజకీయాలు నడుపుతున్నదని వారు ధర్నా చేపట్టారు. ఒక్క సీటు కూడా గెలవని వారు చైర్మన్ ఎలా అవుతారని వారు ఎమ్మెల్యేని నిలదీశారు. మున్సిపాలిటికి మరో ఏడాది పదవికాలం ఉండటంతో నూతన చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. అధికారయుతంగా నోటిఫికేషన్ ఇచ్చి నూతన చైర్మన్ ను ఎన్నుకుంటారు. దీనికి మరో నెల  రోజుల కాలం పట్టనున్నది. మళ్లీ ఎటువంటి రాజకీయాలు నడుస్తాయో అన్న చర్చ భువనగిరిలో హాట్ టాపిక్ గా మారింది.