బీసీల్లో నమ్మకం కోసం వ్యూహాత్మక నిర్ణయం

రాబోయే ఎన్నికల్లో బిసి సామాజికవర్గంలో నమ్మకం కలిగించటం కోసం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. రేపటి ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మెజారిటీ బిసిల మద్దతు అవసరం. అందుకనే ఇటు చంద్రబాబునాయుడు అయినా అటు వైఎస్ జగన్ అయినా సామాజికవర్గాల వారీగా బహిరంగ సభలు, వరాలు గుప్పిస్తున్నది. అందులో భాగంగానే రాజమండ్రిలో చంద్రబాబు జయహో బిసి సభ పెడితే తాజాగా జగన్ ఏలూరులో బిసి గర్జన నిర్వహించారు.

సరే చంద్రబాబు బిసిలకు ఏం చేశారన్నది తేలాలంటే పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు గురించి తెలుసుకుంటే చాలు. అదే జగన్ ఇస్తున్న హామీలను ఎంత వరకూ అమలు చేస్తారో తెలియాలంటే ముందు అధికారంలోకి రావాలి. అందుకే ఒక్క ఛాన్సు ఇవ్వమని జనాలను అభ్యర్ధిస్తున్నారు. అందులో భాగంగానే బిసి గర్జనలో జగన్ మాట్లాడుతూ, మార్చి నెలలో 8 ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ఐదు స్ధానాలు ఎంఎల్ఏల కోటాలోను, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక జరగనుంది.

ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవబోయే ఐదు స్ధానాల్లో ఒకటి వైసిపికి దక్కుతుంది. ఆ ఒక్క స్ధానాన్ని వైసిపి బిసి సెల్ అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ జంగా కృష్ణమూర్తికి ఇవ్వనున్నట్లు బహిరంగసభలోనే జగన్ హామీ ఇచ్చేశారు. అంటే జగన్ ఇచ్చిన హామీ బిసిల్లో కేవలం నమ్మకం కలిగించటానికే అన్న వ్యూహాత్మక ఎత్తుగడ. జగన్ ఇచ్చిన హామీతో బిసిల్లో నమ్మకం కలిగించే అవకాశముంది.

ఎందుకంటే, రేపటి ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం ఎంపి సీట్లను కూడా బిసిలకే కేటాయిస్తానని గతంలోనే హామీ ఇచ్చారు. అప్పటి పరిస్ధితిని బట్టి టికెట్లు కేటాయించేది లేంది తేలుతుంది. కానీ అంతకన్నా ముందే ఎంఎల్సీ పదవిని హామీ ఇచ్చిన ప్రకారం జంగాకు కేటాయిస్తే బిసిల్లో జగన్ పై నమ్మకం పెరగటానికి అవకాశం ఉంది. ఎన్నికల ముందు జగన్ నిర్ణయం వ్యూహాత్మక ఎత్తుగడగానే చెప్పాలి.