జగన్ ప్రమాణ స్వీకార ఖర్చెంతో తెలుసా ?

దుబారాను తగ్గించే విషయంలో కాబోయే సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార ఖర్చులను బాగా తగ్గించేసినట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆర్బాటాలకు, హంగులకు వందల కోట్ల రూపాయలు దుబారా చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి అనేక కారణాల వల్లే ప్రస్తుతం రాష్ట్ర ఖజానా వట్టిపోయింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా చెల్లించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు.

ఇటువంటి పరిస్ధితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న నేపధ్యంలో ప్రమాణ స్వీకారం పేరుతో జరిగే ఖర్చులను కంట్రోల్ చేయాలని అనుకున్నారు. అందుకనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీగా కాకుండా సింపుల్ గా పూర్తి చేయాలని నిర్ణయించారు. అందుకే మొదట 7 లక్షల మంది సమక్షంలో చేయాల్సిన కార్యక్రమాన్ని కేవలం 30 వేల మందికే పరిమితం చేశారు.

వందల ఎకరాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసేకన్నా సింపుల్ గా ఇందిరా గాంధి స్టేడియంలో చేయాలని జగన్ నిర్ణయించారు. అందుకే  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీలైనంతలో ఎవరినీ రావద్దని స్వయంగా జగనే చెప్పటం గమనార్హం. అసలే ఎండలు మండిపోతున్నాయి. దాంతో దూరప్రాంతాల నుండి ఎవరూ విజయవాడకు రావద్దన్నారు. ఎవరికి వాళ్ళు తమ ఇళ్ళలోనే కూర్చుని లైవ్ ప్రసారాలు చూడండని సలహా కూడా ఇచ్చారు.

చంద్రబాబునాయుడు తన ప్రమాణ స్వీకారాన్ని వందల ఎకరాల్లో చేశారు. అందుకు రూ. 10 కోట్లు  ఖర్చయింది. జిల్లాల నుండి వేలాది ఆర్టీసీ బస్సుల్లో కార్యకర్తలను తరలించారు. కానీ జగన్ అలాంటివి అవసరం లేదని తేల్చేశారు. ఓ అంచనా ప్రకారం ప్రస్తుత ఖర్చు ఎక్కువలో ఎక్కువ రూ. 10 లక్షలని అంచనా.

మొత్తం మీద 30 వేల మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్ళాయి. 10.500 పాసులను మాత్రమే మంజూరు చేశారు. సరే ముఖ్య అతిధులుగా ప్రధానమంత్రితో పాటు పొరుగు రాష్ట్రాల సిఎంలను కూడా ఆహ్వానించక తప్పదు కాబట్టి ఆహ్వానించారు. నగరంలో ఎక్కడిక్కడ పెద్ద సైజులో ఎల్ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు పబ్లిక్ కోసం. చూశారా ఖర్చుల విషయం నుండే ఎంత పొదుపు పాటిస్తున్నారో.