ఆంధ్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిసారీ ఎన్నికల పోటీలో అధికార ప్రతిపక్షాల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంటుంది. ఇక్కడ రాజకీయ నేతల్లో ఎప్పుడూ ఒక గందరగోళం ఉంటుంది. నేతలు కళ్ళజోడు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతుంటారు. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత రేపు వేరే పార్టీలో ఉంటారు. మరి ఇలాంటి రాజకీయ నేపధ్యం ఉన్న నెల్లూరులో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు అధినాయకులు.
నేతలు కూడా పార్టీలో సీటు దక్కకపోతే కండువా మార్చటానికి కూడా వెనుకడుగేయట్లేదు. కాగా ఇప్పుడు అదే జిల్లాలోని గూడూరు నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసేది ఎవరు అని ఆసక్తికర చర్చ నడుస్తోంది. అనూహ్యంగా ఒక మహిళా నేత పేరు బయటకి వచ్చింది. జగన్ ఆమె విషయంలో సానుకూలంగా ఉన్నారా? లేదా? ఆమె పోటీ చేస్తే వైసిపి అక్కడ గెలుపొందేనా? అనే వివరాలు కింద ఉన్నాయి చూడండి.
ఒకసారి 2014 ఎన్నికలను చూస్తే వైసిపి అభ్యర్థి పి.సునీల్ కుమార్, టీడీపీ తరపున రాధా జ్యోత్స్నలత పోటీ చేయగా వైసిపి విజయం సాధించింది. సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్దీ రోజులకే పార్టీ ఫిరాయించి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ విషయం టీడీపీ నేత జ్యోత్స్నలతకు మింగుడు పడలేదు. ఆయన రాకను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తగ్గట్టు ఆయనతో కలిసి పని చేయాల్సొచ్చింది ఆమెకు. కాగా నియోజకవర్గంలో జరిగే పలు పార్టీ కార్యక్రమాల్లో సునీల్ కుమార్ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆమె అధిష్టానానికి కంప్లైంట్ చేశారు.
ఇరువురి మధ్య సఖ్యత కల్పించడానికి పలుమార్లు సమావేశాలు చేశారు పార్టీ ముఖ్య నేతలు. అయినప్పటికీ ఇద్దరి మధ్యన అగ్గిలో వేసిన గుగ్గిలం మాదిరిగా విభేదాలు తయారయ్యాయి. ఇరువురి తీరులోనూ మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ నడిచింది. రానున్న ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో టిడిపి నుండి పోటీ చేసే అభార్థి ఎవరు అని. జ్యోత్స్నలత కూడా తనకే సీటు కేటాయించాలంటూ అధిష్టానానికి విన్నవించుకున్నట్టు సమాచారం. ఆమె సీటు కోసం ఎంత ఒత్తిడి చేసినా ఆమెకు ఎలాంటి హామీ ఇవ్వలేదట పెద్దలు. దీంతో ఆమె పార్టీ మారే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. వైసిపి కండువా కప్పుకోనున్నట్టు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.
టిడిపి లో టికెట్ లభించకపోవటంతో ఎలాగైనా సునీల్ కుమార్ కి వ్యతిరేకంగా పోటీ చేసి ఆయనను ఓడించాలనే కసితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నెల రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లిన జ్యోత్స్నలత దంపతులు అక్కడ విజయసాయిరెడ్డితో భేటీ అయినట్టు టాక్. ఈ క్రమంలోనే మాజీ సీఎం కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కూడా జ్యోత్స్నలత విషయాన్నీ జగన్ దగ్గర ప్రవేశ పెట్టారట. ఆయనతో జ్యోత్స్నలతకు గూడూరు నియోజకవర్గ టికెట్ ఇవ్వడంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జగన్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు అంతర్గత వర్గాల సమాచారం.
ఏపీ శాసన సభల్లో గూడూరు ఎస్సి రిజర్వ్‌డ్ నియోజకవర్గం. తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న మరో ఆరు శాసన సభలతో పాటు గూడూరు నియోజకవర్గం కూడా ఒకటి. కాగా జ్యోత్స్నలత ఎస్సి సామజిక వర్గానికి చెందిన మహిళ. తన భర్త వైశ్య కమ్యూనిటీ వ్యక్తి. ఆమె పోటీలో నిలబడితే ఈ రెండు వర్గాల ఓట్లు తనకే వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇటు వైసిపి శ్రేణులు కూడా ఆమె వైసిపి నుండి బరిలోకి దిగితే ఈ విషయాన్నే పరిగణలోకి తీసుకుని గెలుపు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.