తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినా కూడా ఇంకా కేబినేట్ ఏర్పడలేదు. దీంతో అంతా తెలంగాణ కేబినేట్ లో స్థానం దక్కించుకునే అమాత్యులు ఎవరు అని చర్చించుకుంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో బిజిబిజిగా గడుపుతున్నారు. గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. వీలు కాకపోతే శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ వస్తారు. ఆయన వచ్చిన వెంటనే కేబినేట్ కూర్పు పై దృష్టి పెట్టనున్నారని సమాచారం.
జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న కేసీఆర్ పాలన పరంగా ఇబ్బంది లేకుండా తన కొత్త బృందంలో సభ్యులను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారట. సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఏ క్షణంలోనైనా మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తొలుత అసెంబ్లీని సమావేశ పరిచి స్పీకర్ ఎన్నిక జరపాలా లేక కేబినేట్ విస్తరణ చేయాలా అనే అంశం పై సందిగ్దత ఉన్నట్టు తెలుస్తోంది.
ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయిస్తే స్పీకర్, డిప్యూటి స్పీకర్ పదవుల ఎంపిక పూర్తి అవుతుంది. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ సులభం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. జనవరి 4 నుంచి మంచి రోజులు ఉండడంతో ఆ లోపే ఎంపికలు పూర్తి చేసి అసెంబ్లీని సమావేశ పరచనున్నారని తెలుస్తోంది. ముందుగా డిసెంబర్ చివరి వారంలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలిసింది. కానీ సీఎం కేసీఆర్ జాతీయ నేతలను కలిసేందుకు వెళ్లడంతో డిసెంబర్ చివరి వారంలో విస్తరణ సాధ్యం కాలేదు. కానీ ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలో అన్న దాని పై సీఎ కేసీఆర్ ఇప్పటికే ఒక క్లారిటికి వచ్చారట. హైదరాబాద్ తిరిగి రాగానే దానిని అమలు చేయడమే మిగిలిందని పార్టీ వర్గా ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు అసెంబ్లీ సిద్దమైంది.
తెలంగాణ కేబినేట్ లో మొత్తం 18 మందికి అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ తో పాటు మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇక 16 మందికి మాత్రమే కేబినేట్ లో అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికల వరకు మిని కేబినేట్ నే సీఎం కొనసాగిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. తొలి దశలో మరో 6 గురు లేదా 8 మందికి స్థానం దక్కనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ అమాత్యులు ఎవరనే దాని పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఓసీ లలో నలుగురికి, బిసిలలో ఇద్దరికి, ఎస్సీ, ఎస్టీలలో ఒక్కొక్కరికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది.