సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా పేలుడు శబ్దంతో దద్దరిల్లిపోయింది. చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ ప్రాంగణంలో నిలిపిన ఓ కారు అకస్మాత్తుగా భారీగా పేలిపోయింది. క్షణాల్లో మంటలు చెలరేగి ఆ ప్రాంతం మొత్తాన్ని ఆవహించాయి. ఒక్కసారిగా వచ్చిన ఆ ఘోర శబ్దం, పొగ దుమారం చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు. సాక్షుల అందించిన వివరాల ప్రకారం, “పేలుడు శబ్దం చెవులు పగిలేలా వినిపించింది. చుట్టుపక్కల భవనాలు కూడా కంపించాయని తెలిపారు.
మొదటి సమాచారం ప్రకారం, ఈ పేలుడులో కనీసం 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల సాయంతో సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం, ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆసుపత్రి ప్రాంగణంలో బాధితుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో వాతావరణం దిగ్భ్రాంతికి గురైంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమించాయి. సుమారు రెండు గంటల కష్టం తర్వాత మంటలను ఆర్పగలిగారు. అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో పెద్దగా జనసంచారం లేకపోవడంతో మరిన్ని ప్రాణనష్టాలు తప్పించబడ్డాయి.
దీనిపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, ఉగ్రవాద దాడి కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. కారు లోపల IED (Improvised Explosive Device) ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు దూరం నుంచి రిమోట్ కంట్రోల్‌తో జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బాంబు నిర్వీర్యకరణ దళం (Bomb Disposal Squad) ప్రదేశం మొత్తం పరిశీలిస్తూ.. సాక్ష్యాలు సేకరిస్తోంది. పేలుడు శక్తి, ఉపయోగించిన పదార్థాల రకం గుర్తించేందుకు నిపుణుల బృందం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. మెట్రో సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. మొత్తం పరిసరాన్ని ఖాళీ చేయించి స్నిఫర్ డాగ్స్ సహాయంతో ప్రతి వాహనం, బ్యాగ్ తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనపై గృహ మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది.
ఢిల్లీలో ఇదొక కొత్త భద్రతా సవాలుగా నిలుస్తోంది. దేశ రాజధానిలో ఇంత పెద్ద స్థాయిలో పేలుడు జరగడం పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశం దగ్గర ఇలాంటి దాడి జరిగిందంటే ఇది జాతీయ భద్రతకు హెచ్చరిక అంటూ భద్రతా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
