ఢిల్లీని కుదిపేసిన కార్ బాంబ్ పేలుడు కేసు దర్యాప్తు ఊహించని దిశగా వెళ్తోంది. నవంబర్ 10న ఎర్రకోట మెట్రో దగ్గర చోటుచేసుకున్న ఆ భారీ పేలుడులో 14 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ అక్కడికక్కడే మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఆ దాడి వెనుక నడిచిన అసలు నెట్‌వర్క్‌ను వెలికి తీయడంలో SIA, SOG బృందాలకు భారీ బ్రేక్ లభించింది.
పుల్వామాకు చెందిన ఎలెక్ట్రిషియన్ తుఫైల్ అహ్మద్‌ను శనివారం అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణ వ్యక్తిగా కనిపించే తుఫైల్ పేరు ఈ టెర్రర్ మాడ్యూల్‌లో ఇంతగా బయటపడుతుందని ఎవరూ ఊహించలేదు. దర్యాప్తు వర్గాల ప్రకారం అతని పాత్ర ముందుగా అనుకున్నదానికంటే మరింత లోతుగా, మరింత ప్రమాదకరంగా ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. తుఫైల్ ఏ వ్యక్తులతో మమేకమయ్యాడు.. అతను టెర్రర్ కమ్యూనికేషన్‌లో ఏ రోల్ పోషించాడు.. కార్ బాంబ్ తయారీలో అతని నైపుణ్యం ఏ మేరకు ఉపయోగించబడింది.. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఏజెన్సీలు అతనిని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి.
ఇప్పటికే దర్యాప్తు అధికారులు మరో కీలక విషయాన్ని గుర్తించారు. ఈ దాడి ఒకే లక్ష్యంపై కాకుండా, ఢిల్లీ సహా పలుచోట్ల ఒకేసారి దాడులు జరపాలని చేసిన పెద్ద కుట్రలో భాగమే కావచ్చని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మాహుతి బాంబర్ డ్రైవ్ చేసిన తెల్లటి హ్యుందాయ్ i20 కూడా ఫరీదాబాద్‌కు చెందిన అల్-ఫలాహ్ యూనివర్సిటీ లింక్ ఉందన్న సమాచారం మరో కోణాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
అంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ టెర్రర్ మాడ్యూల్ మొత్తానికి జైష్–ఎ–మొహమ్మద్‌కి నేరుగా సంబంధం ఉండే అవకాశాలు బృందాలు పరిశీలిస్తున్నాయి. దాడి కోసం కావలసిన నిధులను నిందితులే స్వయంగా సమీకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్నది గుర్తించడానికి ఇప్పటికే ఇంటర్‌స్టేట్ టీమ్‌లు సమన్వయంతో విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. తుఫైల్ అరెస్టుతో ఈ కేసు దర్యాప్తు వేగం పెరిగింది. ఇప్పటి వరకు దాగి ఉన్న పజిల్ ముక్కలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దేశ భద్రతను కుదిపేసే ఈ పెద్ద కుట్ర వెనుక ఉన్న ప్రతి వ్యక్తిని వెలికితీసేవరకూ దర్యాప్తు ఆగదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
