CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ 17 వద్ద సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కాసేపు కలకలం రేగింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
సీఎం కాన్వాయ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో, కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో వాహనం వేగంగా ఉన్నప్పటికీ, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ఘటనతో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చి మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం ఆ వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గతంలోనూ ఇదే తరహా ఘటన: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ 8న, సీఎం హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం కావడంతో, కాన్వాయ్‌లోని వాహనాల భద్రత, నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

