ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడుకి కారణం ఎవరంటే.. NIA, NSG దర్యాప్తు..!

దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా బాంబు దాడి తాకిడితో వణికిపోయింది. చారిత్రక ఎర్రకోట సమీపంలోని చాందినీ చౌక్ మెట్రో స్టేషన్‌ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతం మొత్తం కలకలమయమైంది. పేలుడు అంతటి తీవ్రతతో సంభవించడంతో చుట్టుపక్కల భవనాలు కంపించాయి, ప్రజలు భయంతో పరుగులు తీశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పేలుడులో కనీసం 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం, పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఆసుపత్రి బయట బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో వాతావరణం భారంగా మారింది.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు సంభవించిన కారు పక్కనే ఒక వ్యక్తి శరీరం ముక్కలుగా చిదిమి పడివుండటం దారుణ దృశ్యాన్ని సృష్టించింది. ఆ వ్యక్తి ఆత్మాహుతి బాంబరా, లేక అతని తెలియకుండానే బాంబు అమర్చబడిందా అన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. పేలుడు కదులుతున్న వాహనంలో జరిగిందా, లేక నిలిపి ఉంచిన కారులోనే జరిగినదా అన్న అంశంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.

దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందని అనుమానంతో భద్రతా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలు సేకరిస్తున్నాయి. బాంబు అవశేషాలు, వాహన భాగాలు, మరియు పేలుడు పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు.

పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేశారు. చాందినీ చౌక్ మెట్రో స్టేషన్‌, ఎర్రకోట పరిసర ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి, పేలుడు ముందు జరిగిన కదలికలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజలు, వ్యాపారుల వద్దనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ పేలుడుతో మొత్తం ఎనిమిది వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిలో ఆరు కార్లు, రెండు ఆటోలు, ఒక ఇ-రిక్షా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ డిప్యూటీ చీఫ్‌ ఎకె మాలిక్ మాట్లాడుతూ, “రాత్రి 7:29కి మంటలను అదుపులోకి తెచ్చాం. తమ బృందాలు ఇంకా సంఘటనా స్థలంలోనే ఉన్నాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంది అని తెలిపారు.

ఇదిలా ఉండగా, సిఆర్‌పిఎఫ్‌ డీఐజీ కిషోర్ ప్రసాద్‌ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పుడే వ్యాఖ్యానాలు చేయడం తొందరగా ఉంటుంది. కానీ ఈ పేలుడు సాధారణం కాదని స్పష్టంగా కనిపిస్తోంది.. అని ఆయన అన్నారు. ఇక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

దేశ రాజధాని హృదయంలో ఈ విధంగా పేలుడు సంభవించడం దేశ భద్రతా వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఈ ఘటన వెనుక ఎవరి చెయ్యి ఉందో, అసలు ఉద్దేశం ఏమిటి.. ఆ ప్రశ్నకే ఇప్పుడు మొత్తం దేశం ఎదురు చూస్తోంది.