ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టుగానే కనిపిస్తుంది. ఆగష్టు రెండోతేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుంది. ఈ లోపు ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే పాలక వర్గాలు ఆగష్టు రెండునాటికి పగ్గాలు చేపట్టడానికి అవకాశం ఉండేది. కేవలం మూడు వారాల గడువులో ఇది సాధ్యం కానీ పని. దీంతో పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన తప్పదేమో అనిపిస్తుంది.
గతంలో కూడా పంచాయతీ ఎన్నికలు సమయానికి నిర్వహించక సంవత్సర కాలం పాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. 2012 ఆగష్టు లో పదవీకాలం ముగిస్తే 2013 ఆగష్టు, సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఈ సంవత్సర కాలం పాటు గ్రామపంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. ప్రత్యేకాధికారి, గ్రామపంచాయతీ కార్యదర్శి సంయుక్తతతో పరిపాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుంటే సేమ్ సీన్ రిపిట్ కానుంది.
గ్రామస్థాయిలో అమలులో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ వ్యవస్థ. దీనినే స్థానిక స్వపరిపాలనా సంస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీ కలలు కన్నారు. ఆయన దృష్టిలో ప్రతీ గ్రామం ఒక గణతంత్ర రాజ్యం. బ్రిటీషు గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలను ప్రవేశపెట్టారు. 1919,1935 భారత చట్టాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోశాయి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి కూడా అదే కొనసాగుతుంది. పంచాయతీలకు 29 అధికారాలను రాజ్యాంగం కల్పించింది. స్థానికంగా ఏ సమస్య ఉన్న కూడా ప్రజలు పంచాయతీ కార్యాలయాల ద్వారా పరిష్కరించుకుంటారు. ఇంత ముఖ్యమైన పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన కీలక అధికారాలు రాష్ట్రప్రభుత్వానికి ఉండటంతో నాయకులు తమ రాజకీయాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించి పంచాయతీ వ్యవస్థను నీరుగారుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల గడువు సమీపించిందని ఎన్నికల కమీషన్ ఎన్నికలకు సిద్దమైంది. ఓటర్ల జాబితా కూడా ప్రకటించింది. తమ సిబ్బందిని ఎన్నికలకు సిద్దం కూడా చేసి జనాభా ప్రాతిపదికనా రిజర్వేషన్లు ప్రకటించేందుకు కూడా ఎన్నికల కమీషన్ సిద్దమైంది. కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటంతో ఎన్నికల కమిషన్ ఆగిపోయింది. ప్రభుత్వం ఎన్నికలను ఎప్పుడు ప్రకటించినా తాము సిద్దంగా ఉన్నామని అధికారులు అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం రిజర్వేషన్ల కేటాయింపుగా తెలుస్తుంది. దానితో పాటుగా ఇప్పుడు ఎన్నికలకు వెళితే చాలా చోట్లలో ఓటమి ఏర్పడితే దాని ప్రభావం సాధారణ ఎన్నికల మీద ఉంటుందని టిడిపి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల గొడవ నడుస్తుండటంతో వారు కోర్టులకు వెళ్లారు. 33శాతం బీసీలకు కేటాయించాలని, అలాగే రిజర్వేషన్లన్ని కలిపి 50శాతం మించొద్దని కోర్టులలో కేసు నడుస్తుంది. దీంతో తెలంగాణలో కూడా ఎన్నికలు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో రిజర్వేషన్ల గురించి కోర్టు ఏం చెప్పనుందో చూసి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన 1994 పంచాయతీరాజ్ చట్టమే నడుస్తుంది. అప్పుడు కోర్టు ఇచ్చే తీర్పు , ప్రభుత్వం అనుసరించే విధానాన్ని చూసి ఏపీ సర్కార్ ముందుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. రిజర్వేషన్ల సాకుతో ప్రభుత్వాలు ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నాయి.
పంచాయతీ పాలక వర్గాలు అధికారంలో లేకుంటే కేంద్రం ఇచ్చే ఆర్ధిక నిధులు ఆగిపోతాయి. దాంతో గ్రామాలలో అభివృద్ది కుంటుపడనుంది. ఆగష్టు 2న పాలకవర్గాల పదవీ కాలం ముగిస్తే 14 వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. వీటన్నింటిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారం కావనీ, నిధులు లేక గ్రామాలలో పనుల జాప్యం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ల పదవీ కాలం మూడు వారాలే ఉండటంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోనుందో అనే ఉత్కంఠ ప్రజల్లోనూ, అధికారుల్లోనూ నెలకొంది.