తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 10 వ తేది నుంచి జవనరి 10 వ తేదిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల నియామకం రాజ్యాంగ విరుద్దమని కోర్టు వ్యాఖ్యానించింది. జనవరి 10 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. సోమవారం ఉదయం హైకోర్టు బెంచ్ పైకి కేసు విచారణకు రాగానే న్యాయమూర్తి పూర్వాపరాలను పరిశీలించి తీర్పు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించగా దానికి సుప్రీం అనుమతించలేదు. రెండు రోజుల క్రితమే రిజర్వేషన్ల పెంపు పై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఓటరు జాబితా సిద్దం చేసి ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో రిజర్వేషన్ల విధానం మారనున్నది. ఇప్పటివరకు కేటాయించిన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త రిజర్వేషన్లు వర్తించనున్నాయి. గతంలో నాలుగు పర్యాయాలు ఖరారుచేసిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త రిజర్వేషన్లను ఖరారుచేయనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడం, నూతన గ్రామాలు ఏర్పాటుకావడంతో ఈ నిబంధన వర్తించనున్నది. గ్రామపంచాయతీలకు రిజర్వేషన్ల విధానం 1995లో అమల్లోకి వచ్చింది. జనాభాను ఆధారంగా చేసుకొని మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారుచేస్తున్నారు. జనరల్, జనరల్ మహిళ, బీసీ, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్సీ మహిళ, ఎస్టీ, ఎస్టీ మహిళ క్యాటగిరీలున్నాయి. రోటేషన్ పద్ధతిలో ఒక గ్రామానికి అన్ని క్యాటగిరీలు ఉండేలా రిజర్వేషన్లను ఖరారుచేస్తారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2001, 2006, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు గ్రామాలన్నింటికీ నాలుగు క్యాటగిరీల్లో రిజర్వేషన్లు వర్తించాయి. మరో నాలుగు క్యాటగిరీలో రిజర్వేషన్లు అమలుచేయాల్సి ఉండగా.. ఇప్పుడు అవేమీ వర్తించవు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త గ్రామాల ఏర్పాటుతో ఈ మార్పు అనివార్యమైంది. ఒక గ్రామానికి జనరల్ మహిళ రిజర్వేషన్ ఉంటే.. మళ్లీ ఆ రిజర్వేషన్ వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. దీని ప్రకారం ఆ గ్రామానికి మరో పదేండ్లు మహిళలు ప్రాతినిధ్యం వహించే అవకాశాలుంటాయి.
రిజర్వేషన్ల ఖరారు ఇలా..
రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా తొలుత రాష్ట్రస్థాయి కోటాను ఖరారుచేస్తారు. ఆ తర్వాత జిల్లాలవారీ రిజర్వేషన్ల కోటాను త్వరలోనే విడుదల చేయనున్నారు. పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాల ప్రకారం.. 100 శాతం ఎస్టీలున్న 1,326 గ్రామాలతోపాటు మరో 1,308 గ్రామాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించనున్నారు. 2,634 ఈ గ్రామాలను మినహాయిస్తే రాష్ట్రంలో ఇక 10,117 మైదానప్రాంత పంచాయతీలుంటాయి. వీటిలో జనాభా ఆధారంగా ఎస్టీలకు 5.73 శాతం (580 పంచాయతీలు), ఎస్సీలకు 20.46 శాతం (2,070 పంచాయతీలు) రిజర్వుచేశారు. వీటిని మినహాయించి పాత చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం (3,440 పంచాయతీలు), జనరల్ క్యాటగిరీలో 4,027 పంచాయతీలు ఖరారుచేస్తారు.
50 శాతం మహిళలకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల రిజర్వేషన్లలో మహిళలకు 50 శాతం కేటాయించనున్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పంచాయతీలు, వార్డుల్లో మహిళలకు 50 శాతం కేటాయిస్తారు. గ్రామాల్లో రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన మార్గదర్శకాల్లో వివరించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం 10 వార్డులున్న పంచాయతీలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ఆధారంగా వార్డు స్థానాలను ఖరారుచేయనున్నారు. ఉదాహరణకు 2,900 మంది జనాభా ఉన్న గ్రామంలో ఎంత శాతం ఎస్టీ జనాభా ఉంటే అంత శాతం వార్డులను వారికి కేటాయిస్తారు.
కొత్త బిసి జనాభా గణనను పరిగణలోకి తీసుకోని పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సెప్టెంబర్ లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు పెట్టాలని తీర్పునిచ్చింది. బీసిల జనాభా గణన కోసం మరింత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఏదేమైనా సరే ప్రాసెస్ అంతా 3 నెలల్లోనే చేసి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 3 నెలల సమయం దాటినా కూడా ఎన్నికల ప్రక్రియ చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో సమయం కావాలని సిఎస్ కోరారు. ఎన్నికలు ముగిసినందున వెంటనే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని కోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ కోర్టుకు తెలిపారు.
తెలంగాణలో జూలై 31న సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించి పరిపాలిస్తున్నారు. స్థానిక సంస్థల్లో అభివృద్ది కొరవడిందని అంతా ఆగమాగంగా ఉందని వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో పలువురు కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11 న రాబోతున్నాయి. వచ్చిన ప్రభుత్వం వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు కాగానే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటి తర్వాత మే లో ఎంపీ ఎన్నికలు, జూన్ లో ఎంపీటిసి, జడ్పీటిసి ఎన్నికలు రాబోతున్నాయి. వరుస ఎన్నికలతో తెలంగాణలో మరో ఆరు నెలలపాటు రాజకీయాలు హీటెక్కనున్నాయి. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వాలు ఎన్నికలు పెడతాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో వైపు హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీర్పుతో స్థానిక నేతలంతా అప్పుడే వాటి పై జోరుగా చర్చించుకుంటూ కసరత్తు ప్రారంభించారు.