తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఆయన మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. జనవరి 21 న మొదటి విడత, జనవరి 25 న రెండో విడత, జనవరి 30 న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అదే రోెజు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తవుతుంది. వార్డు మెంబర్ల కోరం లేకపోతే మరుసటి రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు.
తొలి విడత లో 4480 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో 4137 గ్రామ పంచాయతీలకు, మూడో విడతలో 4115 గ్రామ పంచాతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం నిమిత్తం మైకులు వినియోగించాలని నాగిరెడ్డి ఆదేశించారు.
నవంబర్ 11 వరకు ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న వారికే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాలు ఇస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. బ్యాలెట్ పేపర్లలో ఈ సారి కొత్తగా నోటా గుర్తును కూడా పెట్టారు. 12,751 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 19 గ్రామాలలో పలు కారణాలతో పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు.
సర్పంచ్ డిపాజిట్ కు జనరల్ రూ. 2 వేలు
ఎస్సీ, ఎస్టీ లకు వెయ్యి రూపాయలు
వార్డు సభ్యులు.. జనరల్ రూ.500.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 డిపాజిట్ చేయవల్సి ఉంటుంది.
5 వేల కంటే తక్కువగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి లక్షన్నర రూపాయలు ఖర్చు చేయవచ్చు.
5 వేల కంటే ఎక్కువగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేయవచ్చని వివరించారు.
కాగా, 12,751 గ్రామ పంచాయతీల్లోని 1,13,170 వార్డులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
తొలి దశలో 4480 సర్పంచ్, 39,832 వార్డు మెంబర్లు
రెండో దశలో 4137 సర్పంచ్,36,680 వార్డు మెంబర్లు
మూడో దశలో 4115 సర్పంచ్, 36,718వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి.
సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటి చేసే వారి అర్హత, అనర్హతలు ఇవే
* తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం.. నామినేషన్ పరిశీలన నాటికి అభ్యర్థి వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి.
* పోటీ చేసే అభ్యర్ది గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పని సరిగా ఓటరుగా నమోదై ఉండాలి.
* ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదు.
* ఒక వేళ ఆవ్యక్తికి 31.05.1995 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే ఆమె, అతడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు.
* ఆ తరువాత 01.06.1995 కంటే తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు.
* ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్డు ఉత్తర్వులు డబ్లూపీ నెం:17947/2005లో తేది.19.07.2006 తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణించ బడతారు. కానీ వారిని దత్తత తీసుకున్న తల్లిందండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణింపబడరు. ఒక వ్యక్తి ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా కూడా అనర్హుడుగానే పరిగణింపబడతారు.
* ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తరువాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానముగా పరిగణిస్తారు. కానీ అతని రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు.
* ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తికి నామినేషన్ పరిశీలనకు రోజుకి ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు.
* ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులు.
* కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక సంస్థలలో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు. కానీ తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం-2018 ప్రకారం నామినేషన్ పరిశీలన తేది నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తరువాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్ పరిశీలన చేస్తారు.
* రేషన్ దుకాణం డీలర్ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు అని ఉమ్మడి హైకోర్డు డబ్ల్యూపీ నెం:14189/2006లో సోమ్నాద్థ్ వి విక్రం, కె అరుక్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని రేషన్ షాప్ డీలర్ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు అని తీర్పు చేప్పింది.
* అంగన్‌వాడీ వర్కర్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు కారు.
* నీటి వినియోగదారుల సంఘం సభ్యులు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదు.
* సహకార సంఘాల సభ్యులు పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హతకలిగిఉంటారు. సహకార సంఘాల చట్టం 1954 కింద సహకార సంస్థలు రిజిస్టరు అవుతాయి కాబటి వారు ప్రత్యేక శాసనసభ ద్వారా చట్టం చేయబడిన చట్టం ద్వారా నియమించలేదు కాబట్టి వారికి అవకాశం ఉంది.
* స్వచ్ఛంద సంస్థల, మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు ఎన్నికలలో పోటీ చేయరాదు. 1987 హిందూ మతసంస్థల చట్టం, దేవాదాయ శాఖ సెక్షన్ 15 ప్రకారం సంస్థలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి.
* తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణ సంస్థ, సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌లో పని చేస్తున్న వారు తెంగాణ పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం 25 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన సంస్థలు, కంపెనీల మేనేజింగ్ ఏజెంట్లు, మేనేజర్లు, సెక్రటరీలు పోటీ చేయరాదు. కానీ ఆయా సంస్థలలో పని చేస్తున్న ఇతర ఉద్యోగులు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు. అలాగే ప్రభుత్వం ద్వారా 25శాతం కంటే తక్కువ పెట్టుబడి ఉన్న సంస్థలు, కంపెనీల మేనేజింగ్ ఏజెంట్లు, మేనేజర్లు, సెక్రటరీలు పోటీ చేయడానికి అర్హులు.
* ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతి పాదకుడుగా ఉన్న వ్యక్తి అదే వార్డు, ప్రాధేశిక నియోజక వర్గం నుంచి పోటీ చేయవచ్చు
* అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినప్పటికి నామినేషన్ తిరస్కరించరు. కానీ అభ్యర్థి పై ఇతరులు పిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్ అధికారి అభ్యర్థి ఇచ్చిన నామినేషన్ పత్రాలలో ఇచ్చిన సమాచారం తప్పు అని భావించినైట్లెతే నేరుగా ఐపీసీ సెక్షన్ 177, క్రిమినల్ పోసీసర్‌కోడ్ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో పిర్యాదు చేయాలి కానీ నామినేషన్ తిరస్కరించరాదు.
* పోటీ చేస్తున్న వ్యక్తి మతి స్థిమితం లేకుంటే పోటీకి అనర్హుడు అవుతాడు. ల్యునసిచట్టం 1912 ప్రకారం నిర్ధారణ అయితే అనర్హత వేస్తారు. కానీ దానికి ఆ వ్యక్తి తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం ప్రకారం నిర్ణీత న్యాయస్థానం ఆ అభ్యర్థి మతి స్థిమితం లేనట్లు నిర్ధారిస్తేనే అతడు అనర్హుడవుతాడు.
* నామినేషన్ వేస్తున్న వ్యక్తి ఎలాంటి ధ్రువీకరణపత్రాలు అదేరోజు ఇవ్వక పోయిన నామినేషన్ తీసుకుంటారు. కానీ చెక్‌లిస్ట్‌లో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి. ఆ తరువాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేది సాయంత్రం 5గంటల లోపు సమర్పించాలి. ఆతరువాత ఇచ్చిన స్వీకరించరు. నామినేషన్ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయించబడుతుంది.
* పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాధకుడు నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడవిట్ సమర్పించాలి. కానీ దానికి రిటర్నింగ్ అధికారి తనంతటతాను సంతృప్తి పొందాలి.
* ప్రతిపాధనకుని సంతకం పోర్జరీ అని తేలితే దానికి రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ తరువాత నిర్ధారించి ఆ నామినేషన్ తిరస్కరించవచ్చు.
* ఒక వ్యక్తి తెలంగాణపంచాయితీరాజ్ చట్టంప్రకారం గరిష్టంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చు
* ఒక అభ్యర్థి ఎక్కువ నామినేషన్లు వేసిన చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒక్కసారిమాత్రమే రాస్తారు.
* అభ్యర్థి తన నామినేషన్ ఉమసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు నిరిక్షించి ఉపసంహరించుకోవాలి
* నామినేషన్ వేయడానికి అభ్యర్థి, ప్రతిపాధకుడుతో పాటు మరో ముగ్గురుని రిటర్నింగ్ అధికారి తన గదిలోకి అనుమతి ఇస్తారు.
* నామినేషన్‌లో అభ్యర్థి సంతకం మర్చి పోతే దానికి తిరస్కరించవచ్చు, ఒక్క సారి నామినేషన్ వేసిన తరువాత మార్పులు చేర్పులకు అవకాశం లేదు.
* అభ్యర్థి నామినేషన్ ఉపసంహారణ నోటీసును స్వయంగా సంతకం చేసి నామునాలో సమయంలోపు రిటర్నింగ్ అధికారికిఇవ్వాలి. అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాతపూర్వకంగా అధికారం ఇవ్వబడిన ప్రతిపాధకుడు, ఎన్నికల ఏజంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించవచ్చు.
* పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1000, ఇతరులు రూ.2000 చెల్లించాలి.
* అభ్యర్థి ఇక్క సారి నామినేషన్ ఉపసంహారణ తరువాత దానిని రద్దు చేసుకోవాడానికి వీలు లేదు.
* రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తే దానికి తెలంగాణపంచాయితీరాజ్ చట్టంప్రకారం మరుసటిరోజు సబ్‌కలెక్టర్, ఆర్డీవోకు అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చు.
* ఒక వ్యక్తి ఎక్కువ ప్రాథేశిక నియోజకవర్గాలలో/ వార్డులలో పోటీ చేయకూడదని తెలంగాణ పంచాయితీరాజ్ చట్టంలో ఎక్కడా లేదు. కానీ ఓటు హక్కుమాత్రం ఒక్కసారిమాత్రమే వినియోగించుకోవాలి.
* పోటీ చేస్తున్న వ్యక్తి పై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారించబడితే పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. కానీ శిక్ష అనుభవించకుండా బెయిల్ పై ఉంటే అనర్హత నుంచి బయటపడినట్లు భావించారు. ఇలా అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.