ఒక పాట నీ  జీవితాన్నే మార్చేస్తుంది గురూ

(అహ్మద్ షరీఫ్)

అనగనగా అంటే, దాదాపు 30, 40 సంవత్సరాల క్రింద అనుకుందాం. సినిమాలు, పాటలు, మన జీవితాల్లో ఒక భాగంగా ఉండేవి . మనల్ని విపరీతంగా ప్రభావితం చేసేవి. అ సినిమాలు, సినిమా నిండా నటుల్ని కాకుండా బంధువుల్ని తెచ్చేవి. మరో సినిమా (సంవత్సరానికి ఒకటి అనుకుందాం) వచ్చేంతవరకు అ సినిమా ని మరిచిపోనిచ్చేవి  కాదు.

అప్పుడు మామయ్య లు (అంకుల్స్ కాదు) అంటే అమ్మ స్నేహితురాలి భర్తో, నాన్న స్నేహితుడో వుండేవారు వారు విదేశాలనుండి (అంటే పక్క ఊరినించి అన్నమాట) వచ్చే వారు. వారు పిల్లలమీది ప్రేమతో సినిమా చూడడానికి రెండు రుపాయలిచ్చే వారు. దానితో ఇంటిల్లిపాదీ రాను పోను ఖర్చులతో సహా సినిమా చూసి (పావలా టికట్టు), మధ్యలో గోలి సోడా తాగి రెండుమూడు నెలలకు సరిపడా  ఆనందాన్ని మూట గట్టుకునేవారు.

అప్పుడు సినిమా వస్తే పండగ వచ్చినట్లే. ఇప్పుడు పండగలోస్తే  సినిమాలు వచ్చినట్లే.

అలాంటి  రోజుల్లో అ సినిమాల్లో కొన్ని అద్భుతమైన  పాటలుండేవి. వాటిలో పాటలు మనషుల జీవితాల పై ఏంతో  ప్రభావం చూపించేవి.

సుప్రసిద్ధ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  తాను ఇచ్చిన చాలా ఇంటర్వ్యూ లలో తాను హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ పాడిన దీవాన హువా బాదల్ పాటతో చాలా ప్ర భావితుడ్ని అయ్యే వాడిననీ, అ పాట ఎప్పుడు ఎక్కడ వినిపించినా అక్కడే ఆగి వినే వాడిననీ పేర్కొన్నారు. సంగీతానికున్న మహత్యమే అది.

ప్రతి మనిషి  కీ ఎదో ఒక సమస్య ఉంటూనే వుంటుంది. కొన్ని సార్లు ఈ సమస్య ఇక తీరదు అనిపిస్తుంది, అన్ని దారులు మూసుకున్నట్లు, చుట్టూ అంధకారం అలుముకున్నట్లు అనిపిస్తుంది. అ సమస్య కు పరిష్కారం కనిపించదు.. నిస్సత్తువ ఆవరిస్తుంది. ఏ పని చేయ బుద్ధి కాదు. అప్పుడు ఏ సమస్యనైనా అ మనిషి మాత్రమె పరిష్కరించుకో గలడు. అ సమస్యను పరిష్కరించుకునే శక్తి అతడికి మాత్రమె ఉంటుంది అని ఎవరైనా చెబితే నవ్వు వస్తుంది, నమ్మ బుద్ధి కాదు. పైగా ఈ సమస్య తనకొస్తే తెలుస్తుంది  అనాలనిపిస్తుంది. అది సహజం.

 

చీకటి తరువాత వెలుగొస్తుంది, అస్తమించే సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు లాంటి సంభాషణలు అప్పుడు రుచించవు. అయితే అదే నిజం. సమస్యల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే సమస్యలే మిగులుతాయి సమాధానాలు దొరకవు. అక్కడే కూలబడకుండా ధీరత్వంతో ముందుకు సాగితే సమస్య కు సమాధానం దొరుకుతుంది.

ఇంత  ఫిలాసఫీ ని సరళమైన, అందమైన పదాలతో అత్యంత మనోహరమైన, సంగీతాన్ని జోడించి, అదీ  అద్భుతమైన చిత్రీకరణ తో సన్నివేశాన్ని చూపిస్తే, మోటివేట్ అవని మనిషి ఉండడు. ఇదే జరిగింది తరతరాలు గా  నిలిచి పోయే ఓ పాటలో. ఆ పాటే వెలుగునీడలు (1961) చిత్రం లోని “కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు”. (గీత రచయిత: శ్రీ శ్రీ  సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు). ఈ పాట సాహిత్యం ఎంత ఉదాత్తంగా,. ఎంత  మోటివేటింగ్ గా వుందో చదవండి. అంతేనా ? దీని సంగీతం ఎంత మాధుర్యంగా వుందో వినండి . వీటన్నింటినీ మించి పదికాలాల పాటు నిలిచి పోయే దీని సన్నివేశపు చిత్రీకరణ చూడండి. అలనాటి సినిమాల్లో ఇలాంటిపాట లేన్నెన్నో.

అలా మనసుకు హత్తు కుపోయి, మన మనసుల్లో నిలిచిపోయిన కొన్ని పాటల్ని గమనిద్దాం.

రక్తసంబంధం (1962) సినిమాలోని  చందురిని మించు  అందమొలికించు ముద్దు పాపాయి వే, నిను కన్న వారింట కష్టముల నీడ కరగి పోయేనులే అనే పాట (గీత రచయిత: అనిశెట్టి.  సంగీతం: ఘంటసాల)

మూగమనసులు (1964) సినిమాలోని ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో పాట (గీత రచయిత: ఆత్రేయ. సంగీతం: కే. వి . మహదేవన్ ) చాలా సరళ మైన పదాలతో లోతైన అర్థాలతో అర్థ మైన వారికి అర్థం కానీ వారికి కూడా ఎంత ఫిలాసఫీ నేర్పింది?

సుఖదుఖాలు (1968) సినిమా లోని ఇది మల్లెల వేళయని  (గీత రచయిత: దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం: కోదండపాణి)

పదహారేళ్ళ వయసు (1978)  సినిమా లోని  “సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా”  (గీత రచయిత: వేటూరి.  సంగీతం: చక్రవర్తి )

సిరి సిరి మువ్వ (1978), శంకరాభరణం (1980) మొదలైన సినిమాలు సంగీత ప్రధానంగా నడిచాయి. వీటి పాటలు ప్రేక్షకుల్ని పరవశింప చేసాయి. అ పాటల్ని ఇప్పటికి మరిచిపోలేం .

సాహిత్యం మాటకొస్తే అప్పటి సినిమా పాటల్లోని సాహిత్యం ఇప్పుడు గొప్ప గొప్ప కవిత్వాలకంటే కూడా గొప్పగా ఉండిందని చెప్పవచ్చు. కారణం ఏమిటంటే  నాటి సినిమా పాటల్లో చాలా సరళమైన పదాలతో ఏంతో నిగూఢ మైన ఫిలాసఫీ ని తెలియచేసారు ఆ నాటి గీత రచయితలు. మచ్చుకు కొన్ని రచనలు చూద్దాం

అగాధ మవు జలనిధిలోనా ఆణి  ముత్యమున్నటులే,

శోకానా మరుగున దాగి సుఖమున్నదిలే

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని,

జరిగేవన్నీ మంచి కని, అనుకోవడమే మనిషి పని  

ఏనుగు పైని నవాబు, పల్లకి లోని షరాబు, గుఱ్ఱము మీది జనాబు, గాడిద పైని గరీబు

నడిచేదారుల గమ్యమొక్కటే నడిపే వానికి అందరొక్కటే

 

కేవలం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి న పాటలే కాదు. ప్రేమగీతాలను ఎలా మరిచి పోగలం

చిట పట చినుకులు పడుతూ వుంటే  చిత్రం ఆత్మబలం

చేతిలో చెయ్యేసి చెప్పు బావా చిత్రం దసరా బుల్లోడు

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది చిత్రం పూజ  ఇలా . .

పాత  సినిమా పాటలు, వాటి సాహిత్యం,  సంగీతం చాలా మంది జీవితాల్లో ఒక భాగమై పోయింది. ప్రేరణ అయిపొయింది.  ఆ పాటల గురించి చెపాల్సి వస్తే ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే అప్పుడు  గళా నికి, గాత్రానికి ఎక్కువ ప్రాధాన్యత వుండేది. సంగీతం (అంటే వాద్యాలు) కేవలం సప్పోర్టింగ్ గా వుండేది. ఇప్పట్లా హోరేత్తించేది  కాదు. అందుకే పాటలో మాధుర్యం వుండేది.. ఇప్పుడు వాయిద్యాల ఘోషలో ఎక్కడో ఒక గొంతు వినిపించీ వినిపించక సాహిత్యాన్ని పలుకుతూ వుంటుంది. సాహిత్యం సంగతి సరే సరి. .ద్వందార్థాలతో వున్న ఆ పాటలు వింటే సంగీతాన్ని ఆస్వాదించడం మరచి పోయి బూతు ఆలోచనల్లో మునిగి పోయే అవకాశం ఎక్కువ. ఐతే అ పదాలు వాయిద్యాల హోరులో సరిగ్గా వినిపించక పోవడం కూడా ఒక రకంగా అదృష్టమే.

అయితే ఇప్పుడు మంచి పాటలు లేవని కాదు. చాలా తక్కువ. బహుశా ఆదరణ దొరకదనో, లేక లోకువ అవుతామనో నేటి సంగీత దర్శకులు చాలామట్టుకు విరిగిన స్వరాల్ని సమకూరుస్తు న్నారు. అలాగే మంచి సంగీత దర్శకులు కూడా సమకాలీనత గురించి బి ఎ  రోమన్ ఇన్ రోమ్ అంటూ అందరితో పాటు తాముకూడా అలాంటి సంగీతాన్నే తీసుకొస్తున్నారు.  

అందుకే ఇప్పుడు చిరకాలం నిలిచిపోయే పాటలు అతి కొద్దిగా వస్తున్నాయి .

మీకు నాలుగు నిముషాలు టైం వుంటే, తెల్లవారు ఝామున చల్లని గాలికి పెరట్లో కుర్చుని, ఓ కప్పు కాఫీ ని ఆస్వాదిస్తూ సిటీ రణగొణ ధ్వనులకు దూరంగా, ఇంట్లో మొదలయ్యే స్కూలు హడావిడి, ఉద్యోగ పరుగు లకు అతీతంగా మనసుకు నఃచ్చిన ఓ పాటని వినండి. మనకు  ఆనందానిచ్చే విషయాలు ఎంత చవగ్గా దొరుకుతాయో, జీవితం లో మనం ఏం పోగొట్టు కుంటున్నామో అర్థ మవుతుంది.