ఈ శతాబ్ధం నాది అని సగర్వగా ప్రకటించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గురించి తెలియని ఆంధ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు అంతేకాదు అప్పటి కవిత్వంలో ఇప్పటి కవులకు ప్రేరణ ఇచ్చిన మహోన్నత కవి . జీవితంలో ప్రభుత్వాలని ఆశ్రయించకుండా , మొక్కుబడిగానో లేదా మెప్పు కోసం కవిత్వం రాసిన వాడు కాదు శ్రీశ్రీ . అందుకే మహాకవి ఈ శతాబ్దం నాది ప్రకటించుకోగలిగారు . శ్రీశ్రీ నా సాహిత్య జీవితానికి కూడా ప్రేరణ కలిగించారు . దీని వెనుక నేపధ్యం వివరిస్తాను.
1971లో నేను ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. మా అన్నయ్య కోటేశ్వర రావు అప్పుడు చిక్కడపల్లి లో ఉండేవాడు. నేను అన్నయ్యతో ఉండేవాడిని. చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ చాలా దగ్గర. అప్పటికే నేను తెలుగు సాహిత్య చదవడం మొదలు పెట్టాను. లైబ్రరీ లో గంటల తరబడి ఉండి చదువుకొనేవాడిని. క్లాస్ పుస్తకాలు కూడా అంత ఆసక్తిగా చదివేవాడిని కాదు. అలా శ్రీశ్రీ మహా ప్రస్థానం చదవడం మొదలు పెట్టాను. ఆ కవిత్వం నన్ను బాగా ఆకట్టుకుంది. మహాప్రస్థానం పుస్తకం ఇంటికి తెచ్చుకొని పదేపదే చదువుతూ ఉండటం మా అన్నయ్య చూశాడు. “మహాప్రస్థానం చదువుతున్నావ్ నీకు అర్ధం అవుతుందా ? అసలు నీ జీవితంలో ఎప్పుడైనా శ్రీ శ్రీ గారిని చూస్తావా ?” అన్నాడు.
ఆ తరువాత మా అన్నయ్యకు కోపం రావడం నేను ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది . కొన్నేళ్ల తరువాత నేను కవిత్వం రాయడం దానికి “మానవత” అనే పేరు పెట్టడం జరిగింది. అప్పట్లో హైకోర్టు న్యాయవాదిగా వున్న అడుసుమల్లి పాండురంగారావు గారు నాకు బాగా పరిచయం. వారికి నా పుస్తకం అంకితం ఇచ్చాను. పాండురంగారావు గారికి నిర్మాత దర్శకులు యు. విశ్వేశ్వర రావు గారు బంధువులు. ఒకసారి విశ్వేశ్వర రావు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు పాండురంగారావు గారి ఇంట్లో కలిశాను . అప్పుడు నా “మానవత ” పుస్తకానికి శ్రీశ్రీ గారితో ముందు మాట రాయించమని అడిగాను. ఆయన ” తప్పకుండా రాయిస్తాను కాపీ పంపించు ” అని చెప్పారు.
అప్పుడు పక్కనే వున్న పాండురంగా రావు గారు ఆ పుస్తకం తనకే అంకితమని చెప్పారు . విశ్వేశ్వర రావు గారు సంతోషించారు. అప్పుడు పాండురంగారావు గారు “శ్రీశ్రీ గారితో పాటు మీరు కూడా పుస్తకావిష్కరణకు రావాలి ” అని ఆహ్వానించారు.
“ఓ ఎస్ తప్పకుండా ” అని విశ్వేశ్వర రావు గారు హామీ ఇచ్చారు . శ్రీశ్రీ గారు విశ్వేశ్వర రావు గారిని బాస్ అంటారు . విశ్వేశ్వర రావు గారు కూడా శ్రీశ్రీ గారిని బాస్ అంటారు . శ్రీశ్రీ గారి అవసరాలను గమనిస్తూ విశ్వేశ్వర రావు గారు ఆర్ధికంగా సహాయపడుతూ ఉండేవారు. అందుకే విశ్వేశ్వరగారు ద్వారా వెళ్ళాను కాబట్టి సర్వశ్రీ గారు నేనెవరో అప్పటికి తెలియక పోయినా ముందు మాట వ్రాసి పంపించారు.
మిత్రుడు కిన్నెర రఘురామ్ “మానవత ” పుస్తకావిష్కరణ సభను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. జూన్ 1, 1980 ఉదయం 10.00 గంటలకు అశోక నగర్ లోని నగర కేంద్ర గ్రంధాలయం లోని హాల్ బుక్ చేశాము ఈ విషయాన్ని పాండురంగారావు గారు విశ్వేశ్వర రావు గారికి చెప్పారు . ఆరోజు ఉదయం ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నట్టువిశ్వేశ్వర రావు గారు తెలిపారు. ఇక అప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్నా ఆవుల సాంబశివరావు గారి ఇంటికి నేను మా గురువుగారు ఆచార్య తిరుమల వెళ్లి “మానవత” పుస్తకం ఇచ్చి సభాధ్యక్షత వహించవల్సింగా కోరగానే వారు ఒప్పుకున్నారు. అప్పుడు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ . వరదాచారి గారు నేను కార్యదర్శిగా ఉండేవాడిని. అందుకే వరదాచారి గారిని స్పీకర్ రమ్మని ఆహ్వానించాను.
ఇక జూన్ 1 ఉదయం 9. 30 గంటకె ఎందరో వచ్చారు . శ్రీ శ్రీ గారు కారు దిగగానే 20 మంది విరసం సభ్యులు ఆయన చుట్టూ చేరిపోయారు విశ్వేశ్వర రావు గారు పైన హాల్ లోకి వెళ్లిపోయారు . శ్రీ శ్రీ గారు గారు కూడా ఆయన్ని అనుసరిస్తుంటే విరసం వారు అడ్డు నుంచున్నారు
“మీరు ఈ సభలో పాల్గొనడానికి వీల్లేదు ” అన్నారు ముక్త కంఠంతో.
“ఏం ఎందుకని “? ప్రశ్నించారు శ్రీశ్రీ .
ఈ సభను కిన్నెర ఆర్ట్స్ వారు ఏర్పాటుచేస్తున్నారు తెలుసా “? అన్నారు .
కావచ్చు .. అయితే ఏమిటి ” అన్నారు శ్రీశ్రీ .
“కిన్నెరఆర్ట్స్ సంస్థ కు అధ్యక్షులు పోలీస్ అధికారి ఎమ్ . వి .నారాయణ రావు. ఎంతోమంది నక్షలైట్లను చంపించాడు . అలాటి నారాయణ రావు అధ్యక్షులుగా వున్న సంస్థ జరిపే కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి వీల్లేదు ” అని చెప్పారు .
“అయితే దానికి దీనికి ఏమిటి సంబంధం .. నేను సి మద్రాస్ నుంచి ఈ కార్యక్రమం లో పాల్గొనడానికే వచ్చాను ” అని చెప్పారు శ్రీశ్రీ .
అప్పటికే ఆ విషయం తెలిసి నేను క్రిందకు వచ్చాను .
“శ్రీ శ్రీ గారు మీకు విరసం కన్నా ఈ పుస్తక విడుదల కార్యక్రమమే ఎక్కువా ? అని విరసం సభ్యులు నిలదీశారు .
శ్రీశ్రీ గారు .. వారందరి వైపు చూసి … ప్రస్తుతానికి నాకు ఈ పుస్తకావిష్కరణే ముఖ్యం ” అని వారిని పక్కకు జరిపి మెట్లెక్కి పైకి వచ్చారు .
ఆ తరువాత పుస్తకావిష్కరణ సభ కిక్కిరిసిపోయింది . సభలో నిర్మాత దర్శకులు పద్మశ్రీ పుల్లయ్య గారు పాల్గొని నన్ను ఆశీర్వదించారు. నీ జీవితంలో శ్రీ శ్రీ ని చూడలేవని అన్న మా అన్నయ్య కోటేశ్వర రావు ను శ్రీ శ్రీ గారికి పరిచయం చేశాను. మా అన్నయ్య కళ్ళల్లో ఆనందభాష్పాలు. శ్రీశ్రీ ని ఘెరావ్ చేసిన వార్త పుస్తక రిలీజ్ కార్యక్రమం కన్నా ప్రాధాన్యత ఇచ్చారు. మరుసటిరోజు ,ఈనాడు. ఆంధ్ర జ్యోతి , ఆంధ్ర ప్రభ దినపత్రికల్లో బాక్స్ కట్టి మరీ మొదటి పేజీలో ప్రచురించారు. అలా నా తొలి పుస్తకావిష్కరణకు చారిత్రిక నేపధ్యం వచ్చింది.
– భగీరథ.