జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడ్డారు, ఈ మధ్యనే కోలుకున్నారు కూడా. అయినాగానీ, ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎందుకు మీడియా ముందుకు రాలేదు.? అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఆహారపుటలవాట్లు చాలా బావుంటాయి. ఆరోగ్యకరమైన ఆహారమే తింటుంటారు. కానీ, ఏమయ్యిందోగానీ.. కరోనా వైరస్ ఆయన్ని కొంత మేర కఠినంగానే వ్యవహరించినట్టుంది. ఎక్కువ రోజులే వైద్య చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది కూడా. దాంతో, అభిమానులు కొంత ఆందోళన చెందారు. ఎప్పుడైతే కరోనా నెగెటివ్.. అని ప్రెస్ నోట్ జనసేన పార్టీ నుంచి వచ్చిందో, అప్పుడే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. తొలుత కరోనా అనుమానంతో సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.
ఆ తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. సరే, ఇప్పుడు కోలుకున్నారు కాబట్టి, పార్టీ కార్యక్రమాల్లో వర్చువల్ విధానంలో అయినా పాల్గొని వుండాల్సింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టారట. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బయటకు రావడం అంత మంచిది కాదు. ఎందుకంటే, పవన్ బయటకు వస్తే, ఆయన్ని చూసేందుకొచ్చే అభిమానుల్ని కంట్రోల్ చేయడం కష్టం. ఆ విషయం అందరికన్నా బాగా పవన్ కళ్యాణ్ కే తెలుసు. అయితే, పార్టీ నేతలతో వర్చువల్ విధానంలో మాట్లాడటం, ఆ విషయాల్ని బయటకు విడుదల చేయడం ద్వారా జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నింపే అవకాశాన్ని జనసేనాని ఎందుకు కాదనుకుంటున్నారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.