ఫాదర్ సెంటిమెంటుతో యాక్షన్ డ్రామా: ‘విశ్వాసం’(మూవీ రివ్యూ)

 
ఫాదర్ సెంటిమెంటుతో యాక్షన్ డ్రామా!
“విశ్వాసం”
రచన – దర్శకత్వం : శివ 
తారాగణం : అజిత్, నయనతార, జగపతిబాబు, రోబో శంకర్, యోగిబాబు, మైమ్ గోపి, రవిప్రకాష్ తదితరులు 
సంగీతం : డి. ఇమాన్, ఛాయాగ్రహణం : వెట్రి
బ్యానర్ :
నిర్మాతలు :
విడుదల : మర్చి 1, 2019
3 / 5
***

          గత జనవరిలో రజనీకాంత్ ‘పేట’ ని తట్టుకుని రెండొందల కోట్లు వసూలు చేసిన అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ ‘విశ్వాసం’  తెలుగు డబ్బింగ్ ఆలస్యంగా ఈ వారం విడుదలైంది. ఫాదర్ – చైల్డ్ సెంటిమెంటు ప్రధానంగా అన్ని రసాలూ మేళవించిన ఈ ఫ్యామిలీ డ్రామాని తమిళ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. వరసగా అజిత్ తో సినిమాలు తీస్తూ వస్తున్న దర్శకుడు శివ నాల్గో హిట్ గా ఇచ్చిన ఈ రొటీన్ కమర్షియల్ ఫార్ములా,  ఎందుకని ఇంత హిట్టయిందో  ఓసారి చూద్దాం…

కథ

          రావులపాలెంలో వీర్రాజు (అజిత్) రైస్ మిల్లు ఓనర్. వూళ్ళో కష్టాల్లో వున్న వాళ్లకి తోడ్పడుతూంటాడు. వూళ్ళో పదేళ్ళకో సారి జాతర జరుగుతుంది. జాతరప్పుడు ఎక్కడెక్కడి బంధువులూ వచ్చి కలుసుకుంటారు. ఈసారి జాతరకి బంధువుల్లేక వొంటరిగా వున్న వీర్రాజుని ఇప్పటికైనా వెళ్ళి భార్యనీ, కూతుర్నీ తీసుకురమ్మని బలవంతం చేస్తారు అమ్మలక్కలు. వీర్రాజు ముంబాయి వెళ్లి భార్య డాక్టర్ నిరంజన (నయనతార) ని కలుసుకుంటాడు. పదిహేనేళ్ళ కూతురు శ్వేత (అనీఖా) ని చూసి భావోద్వేగాలకి లోనవుతాడు. నిరంజన తనతో వచ్చే సమస్యే లేదంటుంది. అయితే కనీసం ఇక్కడే కూతురికి బాడీ గార్డుగానైనా వుండనివ్వమంటాడు. అతడికి బాడీ గార్డుగా జీతమిచ్చి  కూతురి భద్రత అప్పగిస్తుంది. తండ్రిగా మాత్రం చెప్పుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది. 

          ఎందుకు వీర్రాజు కూతురికి బాడీగార్డుగా వుంటానన్నాడు? కూతురికి వచ్చిన ప్రమాదమేమిటి? అసలు పదేళ్ళ క్రితం భార్య ఎందుకు విడిపోయింది? ఇప్పుడు కూతురికి తండ్రిగా చెప్పుకోలేని పరిస్థితిని ఎలా భరించాడు? ఈ సమస్య ఎలా పరిష్కారమైంది?….ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

          కథలు అవే వుంటాయి. కాకపోతే 200 కోట్లు వసూలు చేయాలంటే వున్న ఫార్ములా కథనే ఇన్నోవేట్ చేసే తెలివితేటలుండాలి. గ్యాప్ తీసుకున్న సెంటిమెంట్లని ప్లే చేయాలి. ఫాదర్ –  చైల్డ్ సెంటిమెంట్ తో సినిమాలు రాక చాలా కాలమైంది. ఈ ఫార్ములాకి స్పోర్ట్స్ జోడిస్తే ఇన్నోవేట్ అయి 200 కోట్లు కురిపిస్తుంది. ఇన్నోవేట్  చేయడానికి ఎలాగూ కూతురితో అమీర్ ఖాన్ ‘దంగల్’ వుంది. కాకపోతే అమీర్ ఖాన్ ట్రైనింగ్ ఇచ్చినట్టు గాక, ట్రైనింగ్ పొందుతున్న కూతురికి బాడీ గార్డుగా వుంటే ‘దంగల్’ ని కాపీ కొట్టినట్టు వుండదు. నేషనల్ జ్యూనియర్ 100 మీటర్ల రన్నింగ్ రేస్ టైటిల్ కోసం ఇంకొకడు ప్రమాదకరంగా అడ్డుపడుతున్నందుకే బాడీ గార్డు అవసరమున్న కథగా మారిపోతుంది. ఆ విలన్ కి కూడా తన కూతురు గెలవాలన్న పంతం. ఇంకేం, సరికొత్త విలనీ కూడా సెట్ అయింది. కూతురు వర్సెస్ కూతురు, తండ్రి వర్సెస్ తండ్రి. డబుల్ ధమాకాతో కలెక్షన్ల వర్షం.

ఎవరెలా చేశారు

          అజిత్ రెండు గెటప్స్ లో కన్పిస్తాడు. పదేళ్ళ క్రితం వూళ్ళో పెళ్లి కాని దసరాబుల్లోడుగా, పెళ్ళయాక పదేళ్ళకే ముంబాయిలో తానిష్ట పడే ప్యూర్ వైట్ మాన్ గా. 47 ఏళ్లకే జుట్టంతా తల్లబడిపోయిన అతణ్ణి చూసి కమెడియన్ వివేక్  అడుగుతాడు, “ డై కొట్టవా?” అని. నెరిసిన జుట్టు అజిత్ పాత్ర ముంబాయిలో కథే ఎక్కువ. సెంటిమెంట్లు, ఎమోషన్లూ ఈ పాత్రకే. ఆ వయసులో అతను చేసే ఫైట్స్ కి కుర్ర ఫైటర్లు గింగిరాలు తిరిగిపోతారు. మరీ మెలోడ్రామాకి పాల్పడకుండా, నేటి కమర్షియల్ సినిమా అనుమతించినంతవరకూ, కూతురితో బాండింగ్ ని ఓ పరిధిలోనే కళ్ళు చెమర్చేలా పాత్ర పోషణ చేసి నిలబెట్టుకున్నాడు. ఫ్యామిలీ డ్రామాకి యాక్షన్ తోడవడంతో, ఆ యాక్షన్ లోంచే కూతురి పట్ల త్యాగం, ప్రేమ, ఆప్యాయత వంటి సెంటిమెంట్లని తన నటనానుభవంతో పిండుకున్నాడు. ముగింపులో పిల్లలతో పేరెంట్స్ వుండాల్సిన తీరు గురించి కదిలించే డైలాగు చెప్తాడు.

          దూరమైన భార్య దగ్గరికి వచ్చే హీరోల సినిమాలుంటాయి. ఆమెని ప్రసన్నం చేసుకుని చేపట్టాలన్న యావతో వుండే కథలు. అజిత్ పాత్ర ఇలాటి చేష్టల జోలికిపోకుండా, కూతురిమీదే దృష్టి పెట్టి, భార్య అప్పగించిన బాధ్యత మాత్రమే నేరవేరుస్తూంటాడు. భార్యకి దగ్గరవ్వాలనో, కూతురికి తను  తండ్రని తెలియాలనో ఎక్కడా ప్రవర్తించడు. ఇందులోని బాధని ప్రేక్షకులు అనుభవించేలా చేస్తాడు. వూళ్ళో వున్నప్పుడు తను సంతోషంగా వుండే పాత్ర, ఆ సంతోషం వెనుక ఆనందం లేని జీవితం. దీన్నే ఇప్పుడూ ప్రేక్షకులు ఫీలయ్యేలా పాత్ర పోషణ చేస్తాడు. ఇందులో ఒకటే ఫిలాసఫీ వుంది, అప్పగించిన బాధ్యత మీద దృష్టి పెట్టి సవ్యంగా నిర్వర్తిస్తే, ఏమివ్వాలో అవన్నీ ఇచ్చేస్తుంది జీవితం. ఈ ఫిలాసఫీ అజిత్ పాత్రకి హుందాతనమివ్వడంతో,  రియల్ హీరో పాత్రగా కన్పిస్తాడు.

 
          నయనతార డాక్టర్ గా ఎక్కడో ముంబాయి నుంచి రావులపాలెం వచ్చి, మెడికల్ క్యాంపు పెట్టి, చదువురాని హీరోతో ప్రేమలో పడి, తనే పెళ్ళికి ఒప్పించుకునే ఏ కాలం నాటిదో పురాతన పాత్ర. కూతురు పుట్టాక హీరోతో తను విడిపోయే సీను తన పవర్ కి నిదర్శనం. ఏ పవర్ తో పెళ్లి చేసుకుందో ఆ పవర్ తో విడిపోయే హక్కు ఆమెకుంది. ఆ రెండు పవర్ఫుల్ ఘట్టాలకి మధ్య అతను వీక్ గా కన్పించడం అతడి తప్పుకాదు. అయినా తప్పదు. పదేళ్ళు తిరిగేసరికల్లా వేల కోట్లకి పడగలెత్తిన కార్పొరేట్ దిగ్గజంగా ఆమె అవతరించడం క్యారక్టర్ గ్రోతే. ఇలాటి క్యారెక్టర్ నటించడం ఆమెకి  కొట్టినపిండి. 

          కూతురి పాత్రలో మలయాళ బాలనటి అనీఖా బెస్ట్ ఛాయిస్. అన్ని సున్నిత భావోద్వేగాలూ ఆమె బాగా నటించగలదు. తనతో పోటీ పడుతున్న అమ్మాయితో పెద్దమనసుతో వుంటుంది. కానీ ఆ అమ్మాయి గెలవడం స్టెరాయిడ్స్  తీసుకుని గెలిచిందని తెలిశాక ఇక వూరుకోదు. ఈ అన్యాయాన్ని ఎదిరించాలనుకుని ప్రాణాల మీదికే తెచ్చుకుంటుంది. ఈ ప్రాణాలు తీసే విలన్ పాత్రలో ఇంకో కార్పొరేట్ హంచో గా జగపతి బాబు కన్పిస్తాడు. తన కూతురి ఆత్మహత్యా యత్నానికి అజిత్ కూతురే కారణమని చంపి పారెయ్యడానికి ఇంటర్వెల్ దగ్గర్నుంచీ మొదలెడతాడు. అజిత్ కీ, జగపతి బాబుకీ రెండు సార్లు ముష్టి యుద్ధాలు భలే వుంటాయి. కూతురికోసం విలనీతో జగపతి బాబు మూస విలన్ పాత్రల  నుంచి బయటికొచ్చి, ఫ్రెష్ విలన్ గా బెటర్ గా కన్పిస్తాడు.

          ఇక ఇతర శాఖలు సంగీతం, కెమెరా స్టార్ సినిమాకి తగ్గట్టే వున్నాయి. ఇంటర్వెల్ ముందునుంచే లొకేషన్స్ ముంబాయికి మారిపోవడం దృశ్యాలకి రిచ్ నెస్ ని తీసుకు వచ్చింది. తమిళ వూర మాస్ ఫైటర్ల బాధతప్పి, ముంబాయి ఫైటర్లతో క్లాస్ గ వున్నాయి యాక్షన్ సీన్లు. అజిత్ గారు మాత్రం అదే తన బ్రాండ్ వైట్ లుంగీ చొక్కాలో ఫైటింగ్ విన్యాసాలు చేస్తూంటే, లుంగీ వూడదా అన్న వెర్రి సందేహాలు మనకొస్తూంటాయి. సల్మాన్ ఖాన్ అయితే లుంగీ చొక్కా వదిలించుకుని  విజృంభిస్తాడు.

చివరికేమిటి

          గోపీచంద్ తో ‘శౌర్యం’, ‘శంఖం’  అనే రెండు తెలుగు సినిమాలు తీసి దర్శకుడైన తమిళ ఛాయగ్రహకుడు శివ, అజిత్ బ్రాండ్ ని వరుసగా ‘వీరమ్’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ అనే నాల్గు సినిమాలతో క్యాష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా ‘విశ్వాసం’ ని రొటీన్ ముఠా / ఫ్యాక్షన్ కక్షల బీభత్స వాతావరణానికి దూరంగా నీటైన ఫ్యామిలీ డ్రామాగా, కొత్త విలనీతో ఇద్దరు పిల్లల పాత్రల్ని ప్రధానంగా చేసి ఒక కొత్త రూపమిచ్చాడు. కుటుంబ ప్రేక్షకులకోసం ఫాదర్ – చైల్డ్ బాండింగ్ ని హైలైట్ చేస్తూ, యాక్షన్ ని ఆ చైల్డ్ సెంటిమెంట్ ని దెబ్బతీసే శక్తిగా చూపించాడు. ఇక్కడే సక్సెస్ అయ్యాడు.  రొటీన్ గా ఇంకేదో పాత కక్షలతో హీరో విలన్లు పోరాడుకునే టెంప్లెట్ ఫ్యామిలీ జానర్ కథగా వుంటే, ఇది రొటీన్ గానే ఫ్లాపయ్యేది.  

          ఇంకోటేమిటంటే, ఈ ఫ్యామిలీ డ్రామాని పస వుండని తెలుగు టైపు లోకల్ ఫస్టాఫ్ – సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో తీయలేదు. సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టి తీశాడు. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో ఇంటర్వెల్ లోపు కథ ప్రారంభమయ్యే విధానం తెలుగు దర్శకులు ఎందుకనో అంతగా ఇష్ట పడ్డం లేదు. కథని తగ్గిస్తూ ఇంటర్వెల్ వరకూ కామెడీలతో,  లవ్ ట్రాకులతో వూరికే కాలక్షేపం చేసి, ఇంటర్వెల్ నుంచి సెకండాఫ్ లో బొటాబొటీ అరగంట కథ చూపించి,  క్లయిమాక్స్ కెళ్ళిపోయే, ప్రేక్షకుల్ని మోసం చేసే, పద్ధతిని అవలంబిస్తూ ఫ్లాప్ తర్వాత ఫ్లాప్ తీస్తూ ఆనందంగా వుంటున్నారు. 90 శాతం ఫ్లాపులు తీయంది ఆనందం వుండడం లేదు. 

          దీన్ని బ్రేక్ చేస్తూ నిజమైన స్క్రీన్ ప్లే చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ ప్రారంభంలో వూళ్ళో జాతర చూపించి, ఫ్లాష్ బ్యాకు ప్రారంభిస్తూ,  హీరో హీరోయిన్ల ప్రేమా పెళ్ళీ విడిపోవడాలూ వగైరా ఓ అరగంటలో ముగించేసి, హీరో ముంబాయి ప్రయాణంతో ఫస్టాఫ్ లోనే కథ ప్రారంభించేశాడు. ప్రారంభించాక, భార్యకి అదే పట్టుదల, కూతురికి ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి కాపాడేక బాడీగార్డుగా వుండేందుకు ఒప్పందం, మధ్యలో వీడెవడ్రా అని విలన్ ఎంట్రీతో ఇంటర్వెల్. 

          సెకండాఫ్ లో కూతుర్ని దొంగచాటుగా ఆమె కోరిన చోటికి తీసికెళ్ళి సరదాలు తీరుస్తూ భార్యతో చీవాట్లు, కూతురి ట్రైనింగ్, విలన్ కూతురితో కూతురి ట్రాక్, రేస్ వగైరా. స్టెరాయిడ్స్ తో రేసు గెల్చిన విలన్ కూతురు హీరో కూతురికి దొరికిపోయి ఆత్మ హత్యా యంత్నం, దీంతో ఉగ్ర రూపం దాల్చిన విలన్ హీరో కూతుర్ని ఫినిష్ చేసే ప్రయత్నంలో హీరో చావుబతుకుల మధ్య ఆస్పత్రి పాలవడం, ఇంకొక్క రోజే పోటీలకి టైం వుండడం, హీరో కూతుర్ని ఇక్కడ్నించి యూఎస్ కి తీసి కెళ్ళి పోతూ భార్య ప్రయాణం, హీరో ఎలాగో లేచి, కూతురికి రక్షణగా వుంటూ ఈవెంట్ ని గెలిపించుకోవడం, తన కోసం ఇంత చేస్తున్న ఈయనెవరని ఆఖరికి కూతురు తల్లిని నిలదీయడం, ఇక తల్లి చెప్పేయడం. 

          కూతురి భద్రతా, ఈవెంటూ ప్రమాదంలో పడిపోయి హీరో ప్రాణాపాయ స్థితికి పతనమవడం ప్లాట్ పాయింట్ టూ అయితే, ఫస్టాఫ్ లో వేరే ఘర్షణల మూలంగా కూతురికి దూరమవడం ప్లాట్ పాయింట్ వన్. ఇలా ఇవి  ఫస్టాఫ్, సెకండాఫ్ కథా బలాన్నీ సమాన ఎమోషన్స్ తో, గోల్స్ తో బ్యాలెన్స్ చేశాయి.

          సినిమా కథల్ని ఇలాటి సార్వజనీన స్క్రీన్ ప్లేలతో తీస్తే ప్రేక్షకులకీ బావుటుంది, సినిమాకీ బావుటుంది.

 

―సికిందర్