ఇలాటి దేవతా విగ్రహాలు చాలా డేంజర్.. ఈ చిన్న తప్పులే నెగటివ్ ఎనర్జీకి కారణమట..!

ఇళ్లలో దేవతల విగ్రహాలు, చిత్రాలను శ్రద్ధగా ప్రతిష్టించి పూజలు చేయడం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారం. కానీ అదే పూజ గదిలో చిన్న చిన్న పొరపాట్లు మీకు తెలియకుండానే నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నాయంటే నమ్మగలరా.. పండితులు, వాస్తు నిపుణుల మాట ప్రకారం.. దేవతల విగ్రహాలను ఎటువంటి క్రమంలో, ఏ దిశలో, ఏ కలయికతో ఉంచుతున్నామన్నది మన ఇంటి శాంతి, శ్రేయస్సుపై నేరుగా ప్రభావం చూపుతుంది.

చాలామంది భక్తులు ఎక్కువ ఫలితాలు వస్తాయని భావించి ఒకే దేవుడికి సంబంధించిన రెండు విగ్రహాలను లేదా రెండు శివలింగాలను ఒకే పూజగదిలో ప్రతిష్టిస్తుంటారు. అయితే ఇది శక్తి అసమతుల్యతను సృష్టిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే శాస్త్రాల ప్రకారం శని దేవుడు, హనుమంతుడు ఒకే పూజా స్థలంలో ఎదురెదురుగా ఉంచడం మంచిది కాదంటారు. శనిగ్రహం కర్మఫలాన్ని ఇచ్చే దేవత కాగా, హనుమంతుడు శక్తిని సమతుల్యం చేసే రక్షకుడు కావడంతో.. ఈ ఇద్దరి శక్తుల స్వభావం భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.

అంతేకాదు ఉగ్ర రూపంలో ఉన్న దేవతల విగ్రహాలు లేదా చిత్రాలను ఒకేచోట ఎక్కువగా ఉంచడం వల్ల ఇంట్లో ఉద్రిక్త ప్రకంపనలు ఏర్పడతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. పూజ గది స్థానం కూడా చాలా కీలకం. ఇంట్లో ఈశాన్య దిశ పూజలకు అత్యంత శుభప్రదమని, తూర్పు లేదా ఉత్తర గోడలు కూడా అనుకూలమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. పూజ చేసే వ్యక్తి తూర్పు వైపు చూస్తూ ఉండటం మంచిదని చెబుతున్నారు.

విగ్రహాల పరిమాణం కూడా ముఖ్యం. ఇంట్లో పెద్ద పరిమాణంలోని విగ్రహాలను ప్రతిష్టించకూడదు. సాధారణంగా 4 నుంచి 9 అంగుళాల ఎత్తు ఉన్న విగ్రహాలే శ్రేయస్కరమని సూచిస్తున్నారు. విరిగిన విగ్రహాలు, ముక్కలైన దేవతా చిత్రాలు ఇంట్లో ఉంచితే అవి అశుభ ఫలితాలను తీసుకువస్తాయని పండితుల హెచ్చరిక. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, విగ్రహాలను దుమ్ము లేకుండా తుడవడం, నిత్యం దీపం వెలిగించడం, తాజా పూలతో పూజించడం వంటివి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని నమ్మకం. ఈ చిన్న నియమాలను పాటిస్తే… ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి, మానసిక స్థిరత్వం పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.