CM Revanth Reddy: ఆ పార్టీని ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరి ఉత్పత్తి, శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలనలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందని, త్వరలోనే విద్య, వైద్య రంగాల్లోనూ ఇదే స్థాయికి చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిన్న నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజాపాలన విజయోత్సవ’ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

బీఆర్ఎస్‌కు కేటీఆరే మైనస్.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. “బీఆర్ఎస్ పార్టీకి కేటీఆరే అతిపెద్ద గుదిబండ. ఆయన ఉన్నంతకాలం ఆ పార్టీని ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారు,” అని రేవంత్ ఎద్దేవా చేశారు. గతంలో మంత్రులను సైతం ప్రగతి భవన్‌లోకి రానివ్వని కేసీఆర్.. ఇప్పుడు ఇద్దరు సర్పంచ్‌లను పక్కన పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

దమ్ముంటే ఓట్లు అడగండి.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్ విసిరారు. “మేము ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే ఓట్లు అడుగుతాం.. మీరు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చిన చోట మాత్రమే ఓట్లు అడగాలి.. సిద్ధమా?” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో పేదలకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని తెలిపారు.

ఎస్ఎల్‌బీసీని పూర్తి చేసి తీరుతాం.. నల్లగొండ జిల్లాకు జీవనాడి లాంటి ఎస్ఎల్‌బీసీ (SLBC) ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్లపాటు గాలికొదిలేసిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పునరుద్ధరిస్తే, అక్కడ ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్, హరీశ్ రావు ఆనందపడ్డారని విమర్శించారు. ఎవరు అడ్డుపడినా ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగన్ లాయర్ ఫైర్ || Ys Jagan Lawyer Niranjan Reddy Fires On YSRCP Leaders Arrest || Chandrababu || TR