ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల విషయంలో ఇక ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న జిల్లాలే నేరాలకు అడ్డాగా మారిపోయాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. విజయనగరం, నెల్లూరు లాంటి జిల్లాలు ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేవో గుర్తు చేస్తూ.. అలాంటి చోట్ల ఇప్పుడు లేడీ డాన్లు కనిపిస్తుండటం ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్యానించారు.
నెల్లూరు లాంటి జిల్లాల్లో గతంలో ఎవరైనా ఎస్పీగా వచ్చినా సరైన పరిస్థితుల్లో పోలీసింగ్ సాగేదని, కానీ గత ఐదేళ్ల పాలనలో నేరస్తులను పెంచి పోషించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా మహిళలే డాన్‌లుగా మారే పరిస్థితి రావడం వెనుక పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఇటువంటి నేర సంస్కృతికి ఇకపై పూర్తిగా అడ్డుకట్ట వేస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రౌడీ షీటర్ల వ్యవస్థను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. లేడీ డాన్లైనా, గ్యాంగ్ లీడర్లైనా, నేరస్తులెవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. వారి తోకలు కట్ చేస్తాం అంటూ నేరస్తులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇక రాజధాని రైతుల అంశంపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో జరిగిన సమావేశం తర్వాత రాజధాని పనుల్లో వేగం పెరిగిందని, రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రెండో దశ భూ సేకరణకు కూడా రైతులు ముందుకు రావడం తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.
ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో రైతులు, ప్రజలు, ప్రభుత్వం అందరూ సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అయితే అభివృద్ధిని చూడలేని కొందరికి మాత్రం సహజంగానే కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, శాంతి భద్రతలు రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాల నుంచి పూర్తిగా శుభ్రం చేయడమే తన లక్ష్యమని, ప్రజల ప్రాణాలు, ఆస్తి భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని చంద్రబాబు ఈ సందర్భంగా మరోసారి భరోసా ఇచ్చారు.
