విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. కీలకమైన చివరి వన్డేలో సఫారీలను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ ఊహించిన దానికంటే వేగంగా, మరో 10.1 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి.. సిరీస్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు.. భారత బౌలర్ల దెబ్బకు నిలకడగా పరుగులు చేయలేకపోయారు. మధ్య ఓవర్లలో కొంత పోరాడినప్పటికీ, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో 50 ఓవర్లలో 270 పరుగులకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ఒత్తిడి కొనసాగించడంతో సఫారీ బ్యాటర్లు భారీ స్కోరు చేసే అవకాశం కోల్పోయారు.
271 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కవర్లు, స్ట్రైట్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో ఫీల్డ్ అంతా పరుగుల వరదలా మార్చాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తనదైన స్టైల్‌లో స్ట్రోక్స్ ప్లే చేస్తూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపించాడు.
రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే భారత్ కు పటిష్ఠమైన పునాది వేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన ట్రేడ్‌మార్క్ క్లాస్‌ను మరోసారి ప్రదర్శించాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ వేగంగా పరుగులు సాధించాడు. జైస్వాల్‌తో కోహ్లీ టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు.
యశస్వి జైస్వాల్ తన ఇన్సింగ్స్ చివరి వరకూ నిలబడి అజేయ సెంచరీ నమోదు చేశాడు. 121 బంతుల్లో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్సింగ్స్‌లో 12 ఫోర్లు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ 45 బంతుల్లోనే 65 పరుగులు చేసి తన దూకుడైన ఆటతీరుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
