Kishan Reddy – Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని, రెండూ అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘మహా ధర్నా’లో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, నెరవేర్చని హామీలపై బీజేపీ రూపొందించిన ‘ఛార్జ్‌షీట్’ను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని బందీగా మార్చిందని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని, కేవలం కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చారే తప్ప, పాలనలోగానీ, దోపిడీలోగానీ ఎలాంటి మార్పు లేదని విమర్శించారు.
“ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ రెండేళ్లలో నిజంగా అమలు చేసి ఉంటే, ఇందిరా పార్క్ వద్ద నాతో బహిరంగ చర్చకు రావాలి,” అని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. హామీలు అమలు చేయకుండానే రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ పేరుతో ఉత్సవాలు నిర్వహించడం నయవంచన అని మండిపడ్డారు. ప్రజలకు ఏం చేశారని ఈ సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రశ్నల వర్షం:
అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదు?
నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న రూ.4,000 ఏమైంది?
వృద్ధులు, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు ఎక్కడ?
బెల్ట్ షాపులను ఎందుకు రద్దు చేయలేదు?
రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న సన్న బియ్యానికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు అమ్మకపోతే పూట గడవని దయనీయ పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్‌దని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎన్నికల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

