సంపద, శ్రేయస్సు, అదృష్టానికి అధిదేవతగా హిందూ మతంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆమె కృప ఉంటే ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతుంటారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల శుక్ర గ్రహ ప్రభావం బలపడి, ఆర్థికంగా మంచి మార్గాలు తెరచుకుంటాయని శాస్త్రోక్త నమ్మకం.
పురాణాల్లో ప్రస్తావన వచ్చిన అరుదైన దక్షిణవర్తి శంఖాన్ని లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తారు. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తులు దూరమై, శుభశక్తులు పెరుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ శంఖాన్ని శుభ్రమైన విధంగా ఇంటికి తీసుకువచ్చి పూజించడం వల్ల ఇంట్లో ధనప్రవాహం ఆగకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఇక శ్రీ యంత్రం లక్ష్మీదేవి దైవిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. దీన్ని కేవలం ఒక యంత్రంగా కాకుండా, సంపదను ఆకర్షించే శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా భక్తులు నమ్ముతారు. శుక్రవారం రోజున శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేసి, ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడంతో ఇంట్లో సానుకూల శక్తి రెట్టింపు అవుతుందన్నది విశ్వాసం. ఇది వ్యాపారంలో స్థిరత్వం, కుటుంబంలో శాంతిని ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు.
లక్ష్మీదేవికి గవ్వలు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. శుక్రవారం గవ్వలను కొనుగోలు చేసి, లక్ష్మీ అమ్మవారికి సమర్పించి పూజించడం మంచిదట. అలాగే వీటిని డబ్బు నిల్వ ఉంచే చోట ఉంచితే వ్యయాలు తగ్గి, ఆదాయం పెరుగుతుందని నమ్మకం. అందుకే చాలా మంది తమ లాకర్ లేదా మనీ పర్స్‌లో గవ్వలను భద్రపరుస్తుంటారు.
లక్ష్మీదేవి సింహాసనం తామర పువ్వుపైనే ఉంటుంది అనే చిత్రణ పురాణాల్లో కనిపిస్తుంది. అందువల్ల తామర పువ్వు శుద్ధతకు, శ్రేయస్సుకు ప్రతీకగా మారింది. శుక్రవారం తామర పువ్వును అమ్మవారికి సమర్పించి పూజించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. అంతేకాదు శుక్రవారం రోజు వెండి కొనుగోలు చేయడం కూడా అత్యంత శుభకరమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. వెండి ఆభరణం అయినా, చిన్న వెండి నాణెం అయినా కొనుగోలు చేసి పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అంటారు. అయితే ఈ రోజున వెండిని దానం చేయకూడదని, అలా చేస్తే శుక్రుని ప్రభావం తగ్గుతుందనే నమ్మకం కూడా ఉంది.
ఈ విధంగా ప్రతి శుక్రవారం కొన్ని చిన్నచిన్న ఆచరణలతో పెద్ద మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతున్నారు. సంపద మాత్రమే కాదు, కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సు కూడా కలగాలంటే ఈ ఆధ్యాత్మిక సంప్రదాయాలను పాటించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
