రాజకీయ ఇమేజి కోసం రచ్చ!(‘సర్కార్’ రివ్యూ )


-సికిందర్

తమిళ హిట్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ స్టార్ విజయ్ – టాప్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ లు అట్టహాసంగా 80 దేశాల్లో ‘సర్కార్’ తో గ్లోబల్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలో ఇంకా మార్కెట్ సంపాదించుకునే ప్రయత్నాల్లో వున్న విజయ్ ఈ తాజా విడుదల తెలుగు హక్కులు ఏడున్నర కోట్లకి అమ్ముడుబోవడం ఒక సంచలనమైతే, ఎన్నికల సీజన్లో ఈ రాజకీయ థ్రిల్లర్ ఒక కీలక పాయింటుతో రావడం తమిళ ప్రేక్షకుల్లో విపరీత క్రేజ్ తీసుకు వచ్చింది. గతంలో ‘తుపాకీ’, ‘కత్తి’ అనే సూపర్ హిట్లిచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్, ఈసారీ అంతే విజయం సాధిస్తారన్న నమ్మకం కూడా సర్కిల్స్ లో ఏర్పడింది.

మహేష్ బాబుతో ‘స్పైడర్’ అనే అట్టర్ ఫ్లాప్ తీసిన తర్వాత మురుగదాస్ చేస్తున్న తాజా ప్రయత్నమిది. ఈ ప్రయత్నంలో టాప్ నటీనటుల్ని, టెక్నీషియన్లనీ, నిర్మాతనీ సమీకరించాడు. ఇంత హంగామా చేస్తూంటే ఈ మూవీ కథ కాపీ కొట్టారన్న ఆరోపణని కూడా ఎదుర్కొన్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గత రెండు హిట్స్ కూడా దీపావళికే విడుదలయ్యాయి. ఇప్పుడు ‘సర్కార్’ కూడా దీపావళి కానుకే. ఇంత హైప్ సృష్టిస్తున్న ‘సర్కార్’ కథేమిటి, ఎలా తీశారు… ఓసారి చూద్దాం…

కథ

హైదరాబాద్ కి చెందిన సుందర రామస్వామి (విజయ్) అమెరికాలో ఓ కార్పొరేట్ కంపెనీ సీఈఓ. ఏ దేశం వెళ్ళినా అక్కడి కార్పొరేట్ కంపెనీల్ని చావు దెబ్బ కొట్టి టేకోవర్ చేసేసే కరకు వ్యాపార మనస్తత్వంతో వుంటాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతూంటే ఓటెయ్యడానికి వస్తాడు. ఇక్కడ పోలింగ్ ఏజెంటుగా తన వదిన చెల్లెలు లీల (కీర్తీ సురేష్) వుంటుంది. తీరా ఒటెయ్యడానికి వెళ్ళేసరికి తన ఓటు ఇంకెవరో వేసేస్తారు. దీంతో ఆగ్రహించి తన ఓటు హక్కుకోసం కోర్టు కెళ్తాడు. తను ఓటు వేసేవరకూ ఆ నియోజక వర్గంలోకౌంటింగ్ అపెయ్యాలని కోరతాడు.

దీనికి మరుగున పడిపోయిన ఎన్నికల చట్టంలోని సెక్షన్ 49 – పి ని కోర్టు దృష్టికి తెస్తాడు. కోర్టు విజయ్ అర్జీని మన్నించి, ఓటు వేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇది ఉద్యమంలా చెలరేగి అనూహ్య పరిణామలకి దారితీసి మొత్తం ఎన్నికలనే రద్దుచేసి తాజాగా జరిపించాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో సీఎం (కురుప్పయ్య)ఆగ్రహించి సుందర్ ని చంపించాలని చూస్తాడు. దీన్ని తిప్పి కొట్టి, ఎన్నికల్లో సీఎం మీద పోటీ చేసి ఓడిస్తానని సుందర్ సవాలు చేస్తాడు. ఇది కాస్తా మొత్తం అన్ని స్థానాల్లో తన అభ్యర్ధుల్ని దింపి పెను సంచలనం సృష్టించడానికి దారి తీస్తుంది…

ఎలావుంది కథ

దొంగ ఓట్లు వేయడం ఎన్నికల్లో ఒక సాంప్రదాయంలా మారింది. తమ ఓటు ఇంకెవరో వేయడంతో ఓటర్లు మౌనంగా వెళ్ళిపోవడం నిత్యం కన్పించే దృశ్యాలుగా మారాయి. ఓటర్లకి సెక్షన్ 49 – పి గురించి తెలియకపోవడమే దీనికంతటికీ కారణం. ఎన్నికల చట్టంలోని ఈ ప్రధాన సెక్షన్ ని కాన్సెప్ట్ గా చేసుకుని ఈ కథ తయారు చేశారు. హాలీవుడ్ పరిభాషలో ఇది హై కాన్సెప్ట్ బ్లాక్ బస్టర్ కథ. అయితే దీనికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయారు. కారణం తమిళనాడులో ఫాలోయింగ్ వున్న స్టార్ గా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్న విజయ్ వ్యక్తిగత కోర్కెలు కాన్సెప్ట్ కి అడ్డుపడ్డాయి.

కాన్సెప్ట్ పరంగా సామాజిక ప్రయోజనం కాస్తా తన రాజకీయ అరంగేట్రపు ప్రయోగశాలగా మారిపోయింది. విజయ్ నటించిన గత హిట్ ‘మెర్సాల్’ (అదిరింది) కూడా రాజకీయ కథే. అందులో జీఎస్టీ మీద విమర్శనాస్త్రాలు సంధించి వివాదాలు సృష్టించాడు. ఇప్పుడు ‘సర్కార్’ లో ఓటు హక్కుమీద గళమెత్తాడు కానీ ఆ గళం తర్వాత ఇంకోలా మారిపోయింది. ఇక ఈ కథని కాపీ కొట్టారని వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత వివాదం సృష్టించాడు. 2007 లో తను రిజిస్టర్ చేయించుకున్న ‘సెంగాల్’ అనే టైటిల్ తో కథని ‘సర్కార్’ కి కాపీ కొట్టారన్న వివాదాన్ని మురుగ దాస్ ఎలాగో పరిష్కరించుకున్నాడు. కానీ బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల్ని ఈ కథతో ఒప్పించడంలో విఫలమయ్యాడు.

ఎవరెలా చేశారు

ఖచ్చితంగా విజయ్ అద్భుతంగా చేశాడు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ కాస్ట్యూమ్స్ లో జంటిల్ మాన్ లా అప్పీయరెన్స్ ఇచ్చే అతను పాత్రకి హూందాతనాన్ని తెచ్చాడు. ప్రతీ సీనూ అతడితో విజువల్ అప్పీలే. తన కెదురైన రాజకీయ పరిస్థితిని కార్పొరేట్ వ్యూహాలతో ఎదుర్కోవడమనే పాత్రచిత్రణ ఫ్రెష్ గా, మూస ఫార్ములా చిత్రణల పాలబడకుండా ఇన్నోవేటివ్ గా అప్డేట్ అయివుంది. అయితే తన ఓటు హక్కు కోసం ఫస్టాఫ్ లో నడిపిన ఇంటరెస్టింగ్ కథ సెకండాఫ్ లో మూస ఫార్ములా బాపతు కథగా మారిపోవడంతో ఇదే పాత్ర సహన పరీక్ష అయి కూర్చుంది.

ఎంటర్ టెయిన్మెంట్ పరంగా ఫస్టాఫ్ లో ఎదుర్కొనే సమస్యలు సీరియస్సే అయినా వాటిని వినోదాత్మకంగా నటించాడు. సెకండాఫ్ లో కథ దారి తప్పడంతో – సన్నివేశాల్లో పూర్తిగా కామన్స్ సెన్స్ కూడా లోపించడంతో – ఈ మొత్తం హై కాన్సెప్ట్ బ్లాక్ బస్టర్ గా వుండాల్సిన మెగా ప్రాజెక్టుని పలచన చేసేశాడు. హీరోయిన్ కీర్తీ సురేష్ తో రోమాన్స్ కూడా అంతంత మాత్రమే.

హీరోయిన్ కీర్తీ సురేష్ విజయ్ పక్క వాద్యంలా వుంటూ గ్లామర్ తో ప్రేక్షకుల్ని కనువిందు చేయడానికే వుంది. ఇంతకి మించి తనకేమీ లేదు ‘మహానటి’ ఫేమ్ నటిగా. ఇక రాజకీయ విలన్లుగా నటించిన కురుపయ్య, రాధారవిలవి కూడా బలహీన పాత్రలే. విజయ్ ఢీకోనేంత సత్తావున్న విలన్లేమీ కారు. ఈ ఇద్దరిదీ పాత్రలకి రాంగ్ ఎంపిక. పోతే ఇంకేవీ చెప్పుకోదగ్గ పాత్రలు లేవు.

సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో వుంది. రాం – లక్ష్మణ్ ల యాక్షన్ కోరియోగ్రఫీ మాస్ కి బాగా నచ్చుతుంది. రెహ్మాన్ సంగీతం విషయానికొస్తే పాటలు, నేపధ్య సంగీతం పేలవంగా వున్నాయి. చాలా డిసప్పాయింట్ మెంట్ ఇలాటి ప్రతిష్టాత్మకం అనుకుని తీసిన బిగ్ బడ్జెట్ మూవీకి రెహ్మాన్ సంగీతం.

చివరికేమిటి

ఇళయ దళపతి విజయ్ రాజకీయ ఇమేజి సృష్టికోసం మురుగ దాస్ ఇలా తీయక తప్పలేదేమో. ఫస్టాఫ్ నీటుగా తీశాడు. మొదటి సీను నుంచీ విశ్రాంతి వరకూ ఎత్తుకున్న పాయింటు నుంచి పక్కకు తొలగకుండా, రోమాన్సులూ డ్యూయెట్లూ కామెడీలూ అడ్డం వేయకుండా, సూటిగా చెప్పాలనుకున్న పాయింటునే చూపిస్తూ విజయ్ పాత్రని నిలబెట్టాడు. సెకండాఫ్ లో పాయింటూ లాజిక్కూ కామన్ సెన్సూ వదిలి పారేసి విజయ్ రాజకీయ మార్కెటింగ్ కోసం ఏటో వెళ్ళిపోయాడు. రచ్చ రచ్చ చేశాడు. 2 గంటల 45 నిమిషాల వరకూ ఈ రచ్చతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. తమిళంలో విజయ్ ఫ్యాన్స్ దీన్ని జీర్ణించుకోగలరేమో గాని ఇతర జీవులు సందేహమే.

‘సర్కార్‌’ ఫస్టాఫ్ రిపోర్ట్: కథేంటి,ఎలా ఉంది?

‘సర్కార్‌’ సెకండాఫ్ రిపోర్ట్: ఎలా ఉంది,వర్కవుట్ అవుతుందా?

తారాగణం: విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, యోగిబాబు, ప్రేమ్ కుమార్ తదితరులు
మాటలు : శ్రీ రామకృష్ణ,
సంగీతం : ఏఆర్ రెహ్మాన్,
ఛాయాగ్రహణం : గిరీష్ గంగాధరన్,
ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : సన్ పిక్చర్స్
నిర్మాత : కళానిధి మారన్
రచన – దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్
విడుదల : నవంబర్ 6, 2018