YS Jagan: జగన్ ఇప్పుడు ఏం చేయాలి?

కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయా?, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చేస్తుందా?, మళ్లీ నవరత్నాలు, బటన్ నొక్కుడుతో పరిపాలన షురూ చేస్తారా?, అదే సలహాదారులు చెప్పిన బాటలో జగన్ నడుస్తారా?, మరో 20 ఏళ్ల పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చలాయిస్తుందా?

ఇవేమీ అంత ఈజీ కాదని, జగన్ భావిస్తున్నట్టు రాజకీయాలు మరీ అంత బ్లాక్ అండ్ వైట్ గా ఉండవని ఆ పార్టీ నాయకులు, అభిమానులు అంటున్నారు. వైయస్సార్సీపికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే జగన్ చాలా కష్టపడాలని సూచిస్తున్నారు.

కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు ఇట్టే గడిచిపోవని, ఇప్పటికైనా కళ్ళు తెరచి పార్టీ బాగోగులను పట్టించుకోవాలని అంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసే తప్పుల వల్ల తిరిగి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని జగన్ భావించడం సరికాదని చెబుతున్నారు. వైయస్సార్సీపీకి 15 ఏళ్లు నిండిన ఈ తరుణంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అన్న విషయంలో వారు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

గత ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిని ముందుగా జగన్ జీర్ణించుకోవాలి. ఇంకా తానే అధికారంలో ఉన్నట్టు, తాను చెప్పినట్టే అన్ని జరగాలి అన్నట్టు ఉన్న ఆయన వ్యవహార శైలిని తక్షణం మార్చుకోవాలి. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి, అసెంబ్లీలో చంద్రబాబుతో సమంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి వంటి డిమాండ్లను పక్కన పెట్టాలి.

175కి 151 సీట్లు ఇచ్చి గెలిపించిన జనం ఐదేళ్లు తిరిగేసరికి 11 స్థానాలకే ఎందుకు పరిమితం చేశారు అన్నది ఆయన ఆలోచించాలి. జనంలో పార్టీ పట్ల ఈ స్థాయిలో ఎందుకు వ్యతిరేకత ఏర్పడింది అన్నది తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న సలహాదారుల వలయాన్ని పక్కనపెట్టి పార్టీ ఘోర పరాజయం సాధించడంలో తన పాత్ర ఏమిటి అన్నది ఆత్మ విమర్శ చేసుకోవాలి.

ముందుగా తన చుట్టూ ఏం జరుగుతోంది అన్నది జగన్ గ్రహించాలి. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలి. తన గురించి, తన పార్టీ గురించి జనం ఏమనుకుంటున్నారు అన్నది సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవాలి. సలహాదారులపై ఆధారపడకుండా సోషల్ మీడియా ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటే పార్టీని ఎలా నడపాలి అన్న విషయంలో జగన్ కు ఒక స్పష్టత వస్తుంది. తన నుంచి జనం ఏం ఆశిస్తున్నారు అన్నది ఆయనకు అర్థం అవుతుంది.

గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలంటే నాయకులు, కార్యకర్తల సహకారం అవసరమన్నది ఆయన గుర్తించాలి. మండల స్థాయిలో కనీసం ఐదారుగురు నాయకులను పేర్లు పెట్టి పిలిచే అంతగా ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో మమేకం కావాలి. జిల్లా స్థాయి అవసరమైతే మండల స్థాయికి వెళ్లి సమావేశాలు, సదస్సులు నిర్వహించి పార్టీలో జోష్ నింపాలి. తనను కలిసేందుకు వచ్చే వారికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే జనానికి, పార్టీ నాయకులకు తగిన సమయం కేటాయించాలి. ఇందుకోసం రోజు కనీసం రెండు గంటలైనా కేటాయించి వారి కష్ట సుఖాలను స్వయంగా వినాలి.

ఇలా కలిసే వారితో మాట్లాడేటప్పుడు సలహాదారులు గాని సంబంధిత కోఆర్డినేటర్లు గాని పక్కన ఉండకుండా చూసుకోవాలి. తన వద్దకు వచ్చే వారికి వ్యక్తిగతంగా తమ సమస్యలు చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే తమ నాయకుడికి తమ ఇబ్బందులు స్వయంగా చెప్పుకున్నాము అన్న సంతృప్తి కలుగుతుంది. తనను కలవడానికి వచ్చే నాయకులను కోఆర్డినేటర్లు సలహాదారులు పరిచయం చేస్తే వారితో ఓ ఫోటో తీసుకొని పంపించేయడం కాదు. వారి భుజం తట్టాలి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని వారి ద్వారా స్వయంగా తెలుసుకోవాలి. అలా తమ సమస్యలు చెబుతున్న వారి పేరు ఊరు గుర్తుపెట్టుకోవాలి.

ఈ విషయంలో రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎంలు చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలకు జనం లో మంచి గుర్తింపు ఉంది. వాళ్ళది ఎలిఫెంట్ మెమరీ అని ఇప్పటికీ రాజకీయ పరిశీలకులు అంటుంటారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూసిన మండల స్థాయి నాయకుడిని కూడా పేరు పెట్టి పిలిచి పలకరించడం వారి నైజం. అంటే ప్రజలు నాయకులు, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చిత్తశుద్ధితో పూర్తి దృష్టి వారిపై సారించి మాట్లాడితేనే ఆ విధంగా గుర్తు పెట్టుకోవడం సాధ్యమవుతుంది. జగన్ కూడా జనంతో ఆ విధంగా మింగిల్ కావాలి. కష్టపడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వగలగాలి.

కష్టపడి పనిచేసిన నేతలకు అవకాశాలు ఇస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. అప్పట్లో ఒక గురుమూర్తిని, వరుదు కళ్యాణి వంటి వారిని పార్టీ గుర్తించడం వల్లనే ఇప్పుడున్న కష్ట కాలంలో వారు పార్టీకి అండగా నిలబడి పార్టీ వాణిని చట్ట సభలో సమర్థంగా వినిపించ గలుగుతున్నారు. ఇటువంటి వారిని గుర్తిస్తే పార్టీ పది కాలాలపాటు జనాల్లో మన గ లుగుతుందన్న నిజాన్ని జగన్ గ్రహించాలి.

రాష్ట్రంలో ఉన్న తక్షణ సమస్యలను అవగాహన చేసుకోవడం, పార్టీ పరంగా వాటి పరిష్కారానికి తన దృక్పథం ఏమిటి అన్నది వివరించడం చాలా అవసరం. తమ పార్టీకి అధికారం కట్టబెడితే సమస్యలను ఎలా పరిష్కరిస్తాము అన్నది జనానికి అర్థమయ్యేటట్టు ఆయన వివరించగలగాలి. అందుకు ఆయన జనంలో తిరగాలి. 2014 నుంచి 2019 వరకు ఆయన పలు రకాల ఉద్యమాల ద్వారా పాదయాత్ర ద్వారా ఆ విధంగా నిత్యం జనం మధ్యనే ఉండేవారు. జనం జగన్ ను తమ మనిషిగా భావించారు.

తమ ఇంట్లో వాడిగా, పెద్ద కొడుకుగా అనుకొని వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకున్నారు. ఆయనకు అధికారం కట్టబెడితేనే తమ సమస్యలు గట్టెక్కుతాయని పూర్తిగా నమ్మారు. అందుకే 151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే జగన్ మళ్ళీ 2019 కి ముందులా మారిపోవాలి. తనను తను మార్చుకోవాలి. ఐపాక్ మీద, కోటరి మీద, సలహాదారుల పైన ఆధారపడకుండా గ్రామస్థాయి వరకు తనకంటూ సొంత మనుషులని తయారు చేసుకోవాలి. అధికారం ఉన్నా, లేకపోయినా తాను జనం మనిషినని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నమ్మకం కలిగించగలగాలి.

అది ఎలా అంటే పార్టీ కోసం జగన్ కోసం ఎందాకైనా పోరాడేలా వారిలో ఆయన స్ఫూర్తి నింపాలి. ఈ పై సూచనలు పాటిస్తే 15 ఏళ్లు నిండిన పార్టీ కొన్ని దశాబ్దాల పాటు జనంలో మనగలుగుతుందని, జగన్ ను తమ వాడిగా భావిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా? పార్టీ నాయకుల, అభిమానుల మాటలను విని మారిన మనిషిగా జనంలోకి వస్తారా? ఆ పార్టీకి పూర్వ వైభవం తెచ్చి మళ్ళీ అధికారం దిశగా నడిపిస్తారా అన్నది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది. చూద్దాం.. జగన్ ఏం చేస్తారో!

వరుదు కళ్యాణి మాస్ వార్నింగ్ || Varudu Kalyani Fire On Vangalapudi Anitha || Ap Legal Council || TR