సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చెరగని ముద్ర వేసిన ఇంటర్‌స్టెల్లార్ మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ క్లాసిక్, ఇప్పుడు భారతదేశంలో రీ-రిలీజ్ అయ్యింది. ఊహించని స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభిస్తూ, కలెక్షన్ల పరంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ప్రత్యేకంగా IMAX, 4DX ఫార్మాట్లలో సినిమా చూసే అనుభవం ప్రేక్షకులకు ఓ సరికొత్త ఫీల్‌ను కలిగిస్తోంది.
తక్కువ ధరలకు రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఈ రీ-రిలీజ్ భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. విడుదలైన మొదటి వారంలోనే మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, రెండో వారంలోనూ అదే జోష్‌ను కొనసాగిస్తోంది. మార్చి 16న ఒక్క రోజులోనే 1.13 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. మొత్తం 728 స్క్రీన్లలో ప్రదర్శించగా, IMAX థియేటర్లలో 57 లక్షలు, 4DX స్క్రీన్లలో 13.5 లక్షల వసూళ్లు వచ్చాయి.
ఇప్పటి వరకు ఈ రీ-రిలీజ్ ద్వారా ఇండియాలో 10 రోజుల్లో 24.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు అయింది. మొదటి రోజు ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నా, పాజిటివ్ మౌత్ టాక్ తో వసూళ్లు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇది కేవలం ఓ రీ-రిలీజ్ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మాత్రమే కాదు, భవిష్యత్తులో మరిన్ని క్లాసిక్ చిత్రాలను మళ్లీ థియేటర్లలో చూడాలనే ట్రెండ్‌ను సెట్ చేసే విధంగా ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఇంటర్‌స్టెల్లార్ రీ-రిలీజ్ మొత్తం 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. థియేటర్లలో కొత్త సినిమాల పోటీ ఉన్నప్పటికీ, నోలన్ మ్యాజిక్ ఇప్పటికీ పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే, భవిష్యత్తులో మరిన్ని హాలీవుడ్ క్లాసిక్స్ రీ-రిలీజ్ అయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.